తెలంగాణ ఎన్నికల పర్వం లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసినప్పటి నుంచి కేసీఆర్ , చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్‌ను తానే ప్రపంచపటంలో పెట్టానని తరచూ చంద్రబాబు చెప్పే వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ ఈ మాటలు కులీకుతుబ్‌షా వింటే ఆత్మహత్య చేసుకుంటాడని వ్యాఖ్యానించాడు కెసిఆర్. అలాగే హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని చంద్రబాబు చెప్పే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అంత సమర్థత ఉంటే అమరావతిలో ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా ఎందుకు వేయలేకపోయారని చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు సంధించాడు కేసీఆర్.
అయితే ఈ రాజకీయ విమర్శలపై చంద్రబాబు విచిత్రంగా స్పందించాడు. ఎందుకో తెలియదు కానీ కేసీఆర్ తనను తరచూ తిడుతున్నారు అని, ఎందుకు తనను కెసిఆర్ అంతలా తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ తన పై సానుభూతి వచ్చేలా కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించారు చంద్రబాబు. అంతే కాకుండా, తాను తెలుగుజాతి కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నానని, కానీ కేసీఆర్ అందుకు అవకాశం ఇవ్వట్లేదని వ్యాఖ్యానించాడు చంద్రబాబు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి చంద్రబాబు ఇటు జగన్ పై అటు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. వీరిద్దరిపై రాజకీయ విమర్శలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
అయితే కెసిఆర్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తికమక కి గురి చేశాయి. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. చంద్రబాబు కెసిఆర్ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థి పై రాజకీయ విమర్శలు సహజమే. అయితే చంద్రబాబు మాత్రం కెసిఆర్ తనపై చేసే విమర్శలు తెలుగుజాతి కలిసి మెలసి ఉండాలనే తన ఆకాంక్షకు విరుద్ధంగా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. అలా మాట్లాడిన కాసేపటికే అదే చంద్రబాబు, తన రాజకీయ ప్రత్యర్థులు అయిన జగన్, పవన్ కళ్యాణ్ మీద, కెసిఆర్ తనపై చేసినటువంటి విమర్శల వంటి విమర్శలే చేశారు. మరి ఈ విమర్శలు చేసేటప్పుడు తెలుగు జాతి కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్ష ఏమైందో చంద్రబాబు వివరించలేకపోయారు.
వేర్వేరు పార్టీల నాయకులు కలిసి ఉంటే ప్రజలందరూ కలిసి ఉన్నట్టు కాదు, అలాగే రాజకీయ నాయకులు పోట్లాడుకుంటే ప్రజలు పోట్లాడుకున్నట్టు కాదు. ఈ విషయంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఏది ఏమైనా ప్రతి అంశంలోనూ సానుభూతి పిండుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఈ మధ్య తరచూ బెడిసి కొడుతున్నాయి.
– జురాన్