గత కొన్ని రోజుల నుంచీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ట్రంపు జ్వరం పట్టుకుంది. అమెరికా ఏమైపోతోంది? అంతర్జాతీయ సమాజం ఏమై పోతోంది? అమెరికన్ ఓటర్లు చాలా పెద్ద తప్పు చేశారు…అంటూ తన నోటికొచ్చిన మాటలు మాట్లాడేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే కూడా నేనే సమర్థుడిని, ప్రపంచం అంతా కూడా తన నాయకత్వ ప్రతిభను గుర్తించాలన్న ఉద్ధేశ్యంతో మాట్లాడుతున్నాడో లేక అమెరికన్ ప్రజల కంటే కూడా నాలాంటి సమర్థుడిని ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు అనే కోణంలో మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. అఫ్కోర్స్…..ఫైనల్‌గా ఎపి ప్రతిపక్షనేత జగన్ కూడా ట్రంప్ లాంటివాడే అని ప్రజలకు పరోక్షంగా చెప్తాడనుకోండి. ఆ రాజకీయ మాటల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పాదాలా నడుస్తున్న రౌడీ రాజ్యంపైన మాత్రం ఎందుకనో చంద్రబాబు మౌనంగా ఉంటున్నాడు.
బాలకృష్ణ పిఎ వినిపించిన బూతు పంచాంగం గురించి సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. పై స్థాయి నుంచి సపోర్ట్ ఉంటే తప్ప సదరు పిఎగారు ఆ రేంజ్లో రెచ్చిపోడు అన్నది నిజం. ఆ పిఎ తండ్రి కూడా చంద్రబాబుకు సన్నిహితుడు. గతంలో చంద్రబాబు దగ్గరే ఆయన పనిచేశారు. అంటే బంధం చాలా గట్టిగా ఉన్నట్టే లెక్క. అందుకే టిడిపి నాయకులే విమర్శల వర్షం కురిపిస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా ఉన్నాడు. ఆ మౌనం ఒక్కటి చాలు…బాలకృష్ణ పిఎకి చంద్రబాబు నుంచి ఉన్న బలం, బలగం ఏంటో అర్థమవడానికి.
తనను విమర్శిస్తూ వార్త రాసిన ఓ జర్నలిస్ట్ పైకి కొన్ని క్రూర జంతువులు దాడి చేశాయి. అది కూడా నడివీధిలో. ఆ వీడియోలో జర్నలిస్ట్‌పైకి దాడికి దిగిన వాళ్ళను చూస్తుంటే సిరివెన్నెల వారి…..‘నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత….’ అన్న సాహిత్యం గుర్తొస్తోంది. అది కూడా ఓ ఎమ్మెల్యే సోదరుడు, ఆయన అనుచరులు అవడం ఇంకా దారుణం. టిడిపిలోకి జంప్ చేసిన సదరు ఎమ్మెల్యే కృష్ణమోహన్ కూడా ఇప్పుడు చంద్రబాబు టీంలో సభ్యుడే. ఆ మధ్య ఓ ప్రభుత్వ ఉద్యోగస్తురాలిపైన దాడి చేసినవాళ్ళు, మైనారిటీ మహిళపైన అఘాయిత్యం చేయబోయిన ఘనుడు, బూతులు మాత్రమే వచ్చినవాడు, జర్నలిస్ట్ పైకి జంతువులా ఎగబడినవాడు…….వాహ్…చంద్రబాబు టీం మెంబర్సా? మనుషులా? అని జనాలు చెప్పుకునే పరిస్థితులు వచ్చినట్టే ఉన్నాయి. సింగపూర్, అమెరికా, జపాన్…..ఇంకా ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే దేశాలలాగా ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేస్తానని ప్రతి రోజూ చెప్తూ ఉంటాడు చంద్రబాబు. రెండున్నరేళ్ళలో ఈ స్థాయికి వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇంకో రెండేళ్ళ తర్వాత ఇంకే స్థాయిలో ఉంటుందో చూడాలి మరి. ట్రంప్ గురించి పట్టించుకునేంత తీరిక ఉన్న చంద్రబాబుకు ఈ లోకల్ కంపు గురించి ఎందుకు తెలియడం లేదు. లేకపోతే…..తనవాళ్ళు అయితే చాలు…..ఎవరు, ఏమైనా చేసుకోవొచ్చు….ఎవరు ఏం చేసినా ఒప్పే అనే భ్రమల్లో ఏమైనా ఉన్నాడా?