తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందంతో సీఎం భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగింది. తుఫాను అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించడంతోపాటు, ఏయే పంటలకు ఎంతెంత నష్టం వాటిల్లిందనేది కూడా వివరించారు. ఆంధ్రాకు కేంద్రం నుంచి తక్షణ సాయం అందేలా నివేదిక ఇవ్వాలంటూ బృందాన్ని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి కూడా తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కూడా నిర్వహించలేదన్న అసంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇక, శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ మీడియాతో ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన నేపథ్యంలో గవర్నర్ నరిసింహన్ అనుసరించిన తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సమాచారం కోసం నేరుగా తనతో మాట్లాడకుండా, పోలీసు ఉన్నతాధికారులతో గవర్నర్ ఎలా మాట్లాడతారని సీఎం అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఢిల్లీలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా జాతీయ మీడియా ముందు ప్రస్థావించే అవకాశం ఉందని సమాచారం. గవర్నర్ పాత్రపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట. ఇదే అంశంపై ఇతర జాతీయ పార్టీల నేతలను చంద్రబాబు కలుస్తారని సమాచారం. నిజానికి, ఇంతవరకూ గవర్నర్ వ్యవస్థ మీదే విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు… నిన్నటి ఎపిసోడ్ తరువాత నేరుగా నరసింహన్ తీరుపై కూడా విమర్శలు చేయడం గమనార్హం.
వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను కేంద్రం ఏవిధంగా వాడుకుంటోందనీ, సొంత రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని భాజపా ఏ విధంగా భ్రష్టు పట్టిస్తోందన్న అంశాన్ని ప్రముఖంగా ఢిల్లీలో చంద్రబాబు ప్రస్థావిస్తారని పార్టీ వర్గాలూ చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ ఉండొచ్చు అంటున్నారు. అయితే, ఆ వివరాలూ, చంద్రబాబు టూర్ పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇంకోపక్క… గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.