ఎవరు చెప్పారండీ.. తెలంగాణలో పార్టీని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదనీ..? ఎవరు అంటారండీ.. తెలంగాణలో కార్యకర్తల గురించి ఆయన పెద్దగా ఆలోచించడం లేదనీ..? ఎందుకంటారండీ… రాష్ట్రంలో కార్యకర్తల్ని సందిగ్ధంలో పడేస్తున్నారనీ..? ఒక్కసారి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం వినండి… రాష్ట్రంలో కార్యకర్తల గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నారో అర్థమౌతోంది. ఒక్కసారి ఆయన మాటలు వినండీ… రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు గురించి ఆయన ఏవిధంగా తపన పడుతున్నారో తెలుస్తుంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ నేతలతో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగుదేశం ఉంటుందీ, తెలుగువారి కోసం పనిచేస్తుందని చెప్పారు. కార్యకర్తల ఆలోచనా విధానం, పట్టుదలను తాను చూస్తున్నాను అన్నారు. ‘మీకూ నాకూ ఉన్న అనుబంధం ఎవ్వరూ తీసేయలేరనీ, ఒక లీడర్ అటూఇటూ అయినా ఎప్పుడూ అది చెరగదూ, అది శాశ్వతం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు! ఇదే ఆఫీస్ లో ఉండగా ఎన్నో సంక్షోభాలు చూశామన్నారు. మాధవరెడ్డి మరణం, పరిటాల రవి హత్య, బాలయోగి ప్రమాదం, నాయకుడు ఎర్రన్నాయుడు మరణం, లాల్ జాన్ భాషా మృతి.. ఇలాంటివి ఎన్నో బాధల్ని మనం తట్టుకున్నామన్నారు. ‘ఈరోజు మిమ్మల్ని(కార్యకర్తల్ని) చూస్తున్నాను. ఏమాత్రం ఆశించకుండా ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ జెండాను మాత్రం వదిలిపెట్టకుండా నిలబెట్టుకున్నారు. అదే మనకున్న ఏకైక అనుబంధం’ అని చంద్రబాబు ఉద్విగ్నంగా చెప్పారు. కొందరు నాయకులు స్వార్థంతో ఆలోచిస్తే, కార్యకర్తలు పార్టీ శాశ్వతంగా ఉండాలని ఆలోచిస్తారన్నారు. ఎన్నో త్యాగాలకు ఓర్చుతున్న కార్యకర్తలంటే తనకు ఎంతో గౌరవమనీ, కుటుంబ సభ్యుల కంటే కార్యకర్తలంటేనే ఎక్కువ అభిమానమని అన్నారు.
ఇక్కడ పదిహేను సీట్లు గెలిచామనీ, ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదనీ, తెలుగుదేశం పార్టీకి ఇలాంటివి కొత్తేం కాదని చంద్రబాబు చెప్పారు! అంతేకాదు, ప్రజలు అనుకుంటే నాయకులు అవుతారు తప్ప, నాయకులు అనుకుంటే ప్రజలు వెంట రారు అని స్పష్టం చేశారు. ఎవరినో గురించి మాట్లాడటానికి తాను రాలేదనీ, తనను నమ్ముకున్న కార్యకర్తలకు శాశ్వతంగా అండగా ఉండాలన్న భరోసా నింపేందుకు వచ్చానన్నారు. వ్యక్తులతో పార్టీకి ఎప్పుడూ ఎలాంటి విభేదాలు ఉండవనీ, ప్రజల తరఫున నిలుస్తామని స్పష్టం చేశారు. ఇక, హైదరాబాద్ అభివృద్ధి, సాఫ్ట్ వేర్ కంపెనీల రాక… ఇలాంటి రొటీన్ అంశాలు కూడా షరామామూలుగానే ఆయన ప్రసంగంలో ఉన్నాయి.
మొత్తానికి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురించి తాను చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను అనే సంకేతాలు కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఉన్నట్టుండి ఒకేసారిగా కార్యకర్తలతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఈ స్థాయిలో గుర్తు చేసుకున్నారు! కార్యకర్తల స్థాయిని అమాంతంగా ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు చెప్పండీ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు సీరియస్ గా తీసుకోవడం లేదా చెప్పండి! ఏమో.. ఇవాళ్ల అయితే సీరియస్ గానే తీసుకున్నట్టు మాట్లాడారు. నిన్నటి సంగతీ, రేపటి సంగతి కార్యకర్తలకే తెలియాలి.