తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి గెలుపు సాధించి పెట్టేందుకు చంద్రబాబు తన రాజకీయ అనుభవం మొత్తం ఉపయోగిస్తున్నారు. ప్రచారమే కాదు… తెర వెనుక వ్యూహాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. చివరి రోజు.. ఖమ్మం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. చంద్రబాబునాయుడు ఏకంగా నాలుగు రోజులు సమయం కేటాయించి.. గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రచారం చేశారు. మొదట్లో చంద్రబాబు ప్రచారాన్ని టీఆర్ఎస్ అస్త్రంగా వాడుకుంటుదని కాంగ్రెస్ భయపడింది. సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి గొప్ప అవకాశంగా భావిస్తారనుకున్నారు. కానీ చంద్రబాబు ప్రచారం ప్రారంభించిన తర్వాత సీన్ మారిపోయింది. ఏ మాత్రం.. వ్యతిరేకత రాకపోగా.. పాజిటివ్‌గా పరిస్థితి మారిపోయింది.
చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని.. ఆయన పెత్తనానికి వస్తున్నారని.. టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదని.. కాంగ్రెస్ హైకమాండ్ అంచనాకు వచ్చింది. గ్రేటర్ లో గతంలో పోటాపోటీగా ఉన్న వాతావరణం… చంద్రబాబు ప్రచారం ప్రారంభించిన తర్వాత కూటమికి అనుకూలంగా మారిందన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ … సీనియర్ నేతల్ని చంద్రబాబు వద్దకు పంపి.. ప్రచారాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకోవాల్సిందిగా కోరింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివకుమార్.. ఇదే విషయంపై .. చంద్రబాబును కలిసి చర్చించారు. డీకే శివకుమార్ పూర్తిగా.. తెలంగాణ ఎన్నికల కోసం సమయం కేటాయిస్తున్నారు. టీడీపీతో సమన్వయం చేసుకుని.. పోల్ మేనేజ్ మెంట్ లోపాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
ముందుగా టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకబడుతున్నట్లు గుర్తింంచి.. వారి బాధ్యత కూడా తీసుకున్నారు. ఆయన అభ్యర్థులు కూడా.. చంద్రబాబు ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు. దీంతో చంద్రబాబు ప్రచారాన్ని పొడిగించుకున్నారు. ఎల్బీనగర్, నాంపల్లి, ముషీరాబాద్, ఖైరతాబాద్ , జూబ్హీహిల్స్, కుత్బుల్లాపూర్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను పక్కన పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నారు. గ్రేటర్ వాసుల్లో చంద్రబాబుపై ఉన్న అభిమానం ఓట్లుగా మార్చుకునేందుకు.. ప్రజాకూటమి పక్కాగా ఏర్పాట్లు చేసుకుంది.
1980లలోనే చంద్రబాబు… హైదరాబాద్ రాజకీయాలపై పట్టు సాధించారు. పాతబస్తీ సహా..ఎక్కడెక్కడ ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయో తెలుసు. అందుకే.. ఈ సారి మజ్లిస్ గట్టి పోటీ ఎదుర్కొంటున్న నాంపల్లి, మలక్ పేట, యాకుత్ పురా నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపేలా…ప్రచారం చేశారు. తన ప్రచారంలో గులాం నబీ ఆజాద్ ను కూడా తీసుకెళ్లారు. ఓ రకంగా చంద్రబాబు ఇప్పుడు గ్రేటర్ లో గెలుపు బాధ్యతల్ని తీసుకున్నారని అనుకోవాలి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో… గ్రేటరే అత్యంత కీలకం. ఇక్కడ అత్యధిక స్థానాలు సాధించే పార్టీకే.. ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం దక్కుతుంది. అందుకే చంద్రబాబు , కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు..