మొత్తం మీద విజయవంతంగా నవనిర్మాణ దీక్ష ముగిసింది. ఏడు రోజుల పాటు రోజుకో అంశంమీద తోలుకొచ్చిన జనాలతో ప్రతిజ్ఞలు చేయించి రోజుకో రెండు మూడు గంటలు ముఖ్యమంత్రి గారు తాను చెప్పదలచుకుంది చెప్పిందే చెప్పి..మాట్లాడించాల్సిన వారితో మాట్టాడించి..మమ అనిపించేశారు. ఈ ఏడు రోజులలో చేసిందేమిటయ్యా అంటే ఏమీ లేదు. ఆయన దీక్షలో మాత్రం ఒక అంశం స్ఫుటంగా అర్థమైంది. దిన పత్రికలు తమ సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి అనుసరించిన మువిధానాన్నే బాబుగారు కూడా అనుసరించారు. పాఠక దేవుళ్ళంటూ ఊరించి, లేఖలు ప్రచురించి, స్థానికుల అభిప్రాయాలను సేకరించి, వారి ఫొటోలతో వేసి, పేపర్లు సర్క్యులేషన్ పెంచుకునేందుకు ప్రయత్నించే వారు. ఒక సర్పంచ్ ఫొటోతో వార్త ప్రచురితమైతే.. ఆయన ఆ పేపరు కాపీలు పది కొని పంచిపెట్టుకునేవాడు. అది క్రమేపీ విస్తరించింది. జోనల్ పేజీలకు చోటిచ్చింది. ఇదో తరహా మార్కెటింగ్. ఇదిప్పుడు రాజకీయాలకూ పాకింది.
ప్రతిపక్షనేత పర్యటనలో ప్రజలతో మమేకం కావడం..వారితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం చేశారు. దీన్నిముఖ్యమంత్రి గారు అందిపుచ్చుకున్నారు. ప్రతి వేదికమీదా కొంతమంది నిఎంపిక చేసుకుని, వారికి మాట్లాడే అవకాశాన్నిస్తున్నారు. విద్యార్థులను ఆయన ఎక్కువగా చేరదీస్తున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులనూ ఆయన ఇందుకు వినియోగించుకుంటున్నారు. ఇది అభినందించదగ్గదే. కానీ.. ముఖ్యమంత్రిగారి ప్రయత్నం అక్కడితోనే ఆగిపోతోంది. ఎవరైనా చెప్పిన సమస్య పరిష్కారమైందా అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. ఉదాహరణకు ప్రజల సమస్యలను వివరించడానికంటూ ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. 1100 నెంబరు ఇచ్చారు. ఆ నెంబరుకు ఫోన్ చేస్తే పలికే నాధుడు కూడా లేడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన ప్రయత్నాలు ఎవరి కోసం చేశారో ఇది ప్రశ్నార్థకం చేస్తోంది. తప్పుడు ఫిర్యాదులు చేసిన వారినీ శిక్షిస్తామని ప్రభుత్వం అంటోంది. అంతా బాగానే ఉంది. ఆ ఫోనునే ఎత్తకపోవడాన్ని బాలారిష్టమనాలా? అసమర్థత అనాలా?
దీక్షలు పూనడం..ప్రతిజ్ఞలు చేయడానికి ప్రజాధనాన్ని వినియోగించడం అవసరమా! ప్రజాధనంతో ప్రభుత్వ ప్రచారం ఎంతవరకూ సబబు? ప్రభుత్వ వేదికపై పార్టీని ప్రమోట్ చేసుకోవడం ప్రజాధన దుర్వినియోగం కిందికి రాదా? విజ్ఞులైన ముఖ్యమంత్రికీ, సిస్టంను ఫాలో అవుతానని చెప్పుకునే ప్రభుత్వాధినేతకీ ఇది తట్టదా. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకీ ఎంతో ఆదర్శంగా ఇంతవరకూ మెలిగి, తన దీక్షాదక్షతలతో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగానూ.. బెంగళూరుకు వణుకుపుట్టించేలా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడుగారేనా ఇలా వ్యవహరిస్తున్నది అనిపించకమానదు. ప్రతిజ్ఞలు చేస్తే పనులైపోతాయా.. ఈ ప్రతిజ్ఞ ఏదో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో చేయించలేదేం? ఇలా ప్రశ్నించిన వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేయవచ్చు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఒక్క పోలవరం ప్రాజెక్టు చాలదు. యువత భవితను తీర్చి దిద్దేందుకు ప్రతిన పూనాలి. అందుకు పేరెన్నికగన్న సంస్థలు కావాలి. పరిశ్రమలు నెలకొల్పాలి. అందుకు ప్రత్యేక హోదా ఎంతో సాయపడుతుందని అందరూ చెబుతున్నారు. ఏడాదికి ఏడురోజులు ప్రతిజ్ఞలు చేస్తే..2050కి ఆంధ్ర నెంబర్ వన్ కాదు. ప్రతిజ్ఞలకు తగ్గట్టుగా పనిచేయాలి. కృషి సాగించాలి. ఆ ఎఫర్ట్‌ను ముఖ్యమంత్రి పెడితే బాగుంటుంది. ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీ వేదికగా ఒక్కరోజు దీక్షకు దిగండి చాలు. హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ఆంధ్రకు నవోధ్యాయమని చాటండి చాలు.
మధ్యప్రదేశ్‌లో రైతుల కాల్చివేత నేపథ్యంలో నెలకొన్ని హింసాత్మక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ముఖ్యమంత్రే స్వయంగా నిరవధిక దీక్షకు కూర్చున్నారు. సీఎం రంగంలోకి దిగితే కాని పనుంటుందా.. ఆంధ్రకు లోపించిందే అది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి