తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనం దాల్చారు. వారం రోజుల క్రితం విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన ఆయనను వైసీపీ శ్రేణులు విమానాశ్రయంలోనే నిలువరించాయి. ఐదు గంటల హై డ్రామా తర్వాత చంద్రబాబు నాయుడుని పోలీసులు హైదరాబాద్ కు పంపించేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇక్కడి తెలంగాణ తెలుగుదేశం నాయకులతో సమావేశం నిర్వహించారు. అమరావతి రైతుల ఉద్యమానికి బాసటగా నిలబడరా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాని తర్వాత ఇప్పటి వరకూ ఆయన ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాలేదు. పైగా అమరావతి గురించి కాని, మరే ఇతర రాజకీయ అంశాల గురించి గాని ప్రస్తావించడం లేదు. ఈ మౌనం వెనుక ఏ ఉపద్రవం దాగి ఉందో అని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్న సందర్భాలు ఉన్నాయి గాని, ఇలా పెదవి విప్పకుండా ఉన్న సందర్భాలు మాత్రం లేవంటున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 80 రోజులు దాటింది. ఆ శిబిరానికి పార్టీ నాయకులు హజరవుతున్నారు. ఈ ఉద్యమంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్దానిక ఎన్నికలకు నగరా మోగడంతో తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ల పాటు అమరావతి ఉద్యమంపై పెదవి విప్పే అవకాశాలు కనిపించడం లేదని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడి మౌనం వెనుక స్దానిక ఎన్నికల వ్యూహంతో పాటు మరో ఎత్తుగడ ఉండే ఉంటుందని అంటున్నారు. రాజకీయాలలో చాణుక్యుడిని మించిన చంద్రబాబు… మౌనం వెనుక మహా పరమార్ధమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.