చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. జగన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజాధనం అంటే.. ఇలాంటి వాటికే ఖర్చు పెట్టాలన్నట్లుగా సోషల్ మీడియా కేసులకూ సుప్రీంకోర్టు వరకూ పోయేవారు. ఇక చంద్రబాబు కేసుకు వెళ్లరా.. వెళ్లారు . ఇప్పుడా కేసు సుప్రీంకోర్టులో ఉంది. శుక్రవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ సమయంలో తమకు దీనిపై వాదించేందుకు.. నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. దాంతో ఈ కేసును వాయిదా వేశారు.
ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఐదు నెలలు అయింది. తనపై పెట్టిన కేసుల్ని కూడా చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చుకునేందుకు మొహమాట పడుతున్నారు. అవి తప్పుడు కేసులు అని టీడీపీ అనేక ఆధారాలు బయట పెట్టింది. సమాచారాన్ని దాచారని..తప్పుడు పత్రాలు సృష్టించారని కూడా వెల్లడించింది. నగదు దుర్వినియోగం కాలేదనిబయట పెట్టింది. ఇప్పుడు మొత్తం వ్యవహారాలను ప్రజల ముందు పెట్టి…కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నా… మొహమాటపడుతున్నారు. వాయిదా ల మీద వాయిదాలు వేస్తున్నారు.
మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ స్టేట్ మెంట్ చంద్రబాబును అరెస్టు చేయడానికి ఉపయోగించుకున్నారు.తాను ఇచ్చిన స్టేట్ మెంట్ అది కాదని మ్యానిప్యూలేట్ చేశారని రమేష్ అంటున్నారు. ఈ ఒక్కటి చాలా.. అటు పీఎస్ఆర్ నుంచి ఇటు సజ్జల వరకూ.. మొత్తం కుట్రలో భాగం చేయడానికి అవసరమైన ఆధారం ఇస్తుంది.కానీ ఎందుకు చంద్రబాబు మొహమాటపడుతున్నారో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు.