ఎక్కడ వున్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా అన్న పాటలో మాదిరిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి దూకడం ఖాయమైనా అధినేత చంద్రబాబు నాయుడు కథ సున్నితంగానే ముగిస్తారని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ మొదటి నుంచి చంద్రబాబు అశీస్సులు అండదండలు పొందిన సంగతివారు గుర్తు చేస్తున్నారు. వయసులోనూ అనుభవంలోనూ చిన్నవాడైనా చాలామంది కంటే చురుగ్గా వుంటారని బాగా పరిశీలన చేసి ప్రత్యర్థులపై దాడి చేయగలరని చంద్రబాబు ఆయనను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. లోకేశ్‌తో కూడా రేవంత్ సన్నిహితంగానే వుండేవారు. ప్రాణాంతకంగా మారిన ఓటుకు నోటు కేసులో రేవంత్ చిక్కుకున్న తర్వాత కూడా పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గకుండా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంటును చేశారు. కాబట్టి రేవంత్ చర్యలకు చంద్రబాబు బాధ్యత కూడావుందని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా పార్టీనే వదలి కాంగ్రెస్‌లో చేరుతున్నా ఎందుకు మౌనంగా వున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. నిజంగా ఈ పూర్వరంగమే చంద్రబాబు చేతులు కట్టేస్తుంది. అంతేగాక ఓటుకు నోటు కేసులో రేవంత్ నోరు విప్పి ఏం చెప్పినా అది గొంతుకు చుట్టుకోవచ్చు. పైగా ఎపిమంత్రులు కీలక నేతలకు తెలంగాణలో వ్యాపార ప్రయోజనాలున్నాయని రేవంత్ ఆరోపించి వున్నారు. అన్నారంటే ఆయన దగ్గర ఏవైనా ఆధారాలుండొచ్చు. రెచ్చగొడితే వాటిని బయిటపెట్టొచ్చు.ఇలాటి స్థితిలో టిడిపిలో వున్నా బయిటకు వెళ్లినా పెద్ద రభస లేకుండా ముగించాలని అధిష్టానం ఆలోచనగా వుంది. తెలంగాణ కన్నా ఎపిలో ప్రభుత్వ సంరక్షణ వారికి ముఖ్యం. రేవంత్ అడ్డం తిరక్కుండా చూసుకోవడం మరీ అవసరం. అందుకే కాంగ్రెస్ ద్వారా రేవంత్ పైకి వచ్చినా చంద్రబాబు సంతోషిస్తారు తప్ప సంఘర్షణ పెంచుకోరని ఆ పార్టీ నాయకులొకరు సందేహం వెలిబుచ్చారు. ఇప్పటి వరకూ అనుసరిస్తున్న వైఖరి కూడా అలాగే వుంది. టిఆర్ఎస్లో చేరిన చాలామంది నాయకులు గత్యంతరం లేని స్థితిలో చంద్రబాబు ఆశీస్సులతోనే చేరామని చెబుతుంటారు. కాబట్టి టిటిడిపిలో కొందరు వూరికే హడావుడి పడి ప్రయోజనం వుండదు.