ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల స్వప్నం.. పోలవరం ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రేడియల్ గేటు ఏర్పాటు ప్రక్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మొత్తం 48 గేట్లను అమర్చాల్సి ఉంది. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా, వెడల్పు 15.9 అడుగులుగా ఉంది. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. ఒక్కో రేడియల్ గేటు బరువు 300 టన్నులు. వీటిని నిలబట్టడం కోసం హైడ్రాలిక్ సిలిండర్లను వాడుతున్నారు. గేట్ల బిగింపు ప్రక్రియ పరిజ్ఞానం మొత్తాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టును 2019 మే నెల చివరి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది.
గేట్ల బిగింపు ప్రక్రియను ప్రారంభించిన తర్వాత చంద్రబాబు రైతు సదస్సులో ప్రసంగించారు. జీవితంలో… తాను ఎప్పుడూ లేనంత ఆనందంగాఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల ఎకరాలకు.. సాగునీరు అందించడాన్ని జీవితాశంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు సదస్సులోప్రకటించారు. దీనికి నదుల అనుసంధానం తప్ప.. మరో మార్గం లేదన్నారు. ఇప్పటికే కృష్ణా – గోదావరి నదులు అనుసంధానం చేశామని… త్వరలో పెన్నాను కూడా అనుసంధానం చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ పేరుతో కాల్వలు తవ్వి కమిషన్లు తీసుకున్నారని.. నిర్వాసితుల్ని పట్టించుకోలేదని మండి పడ్డారు.
పోలవరం ముంపు మండలాలు ఏడు.. ఏపీలో కలపపోతే.. ప్రాజెక్ట్ నిర్మాణం అసాధ్యమని.. అందుకే.. వాటిని ఏపీలో కలిపే వరకూ.. ప్రమాణస్వీకారం చేయనని పట్టుబట్టానని గుర్తు చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ను నిలిపివేసేందుకు… ప్రతిపక్షం పక్క రాష్ట్రాలతో చేతులు కలిపిందని.. చంద్రబాబు ఆరోపించారు. కుట్రలు చేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతానని…చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనవరి ఏడో తేదీన.. అత్యధిక కాంక్రీట్ వర్క్ చేసి…పోలవరంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించబోతున్నారని… చంద్రబాబు ప్రకటించారు.