ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ డిక్సన్ తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ అనగానే చైలోని షెంజెన్ అందరికీ ఎలా గుర్తుస్తుందో, ఇండియాలో తిరుపతి కూడా అదే స్థాయికి గుర్తుకు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో త్వరలో 1500 మందికి ఉపాధి లభిస్తుందనీ, ఆంధ్రాలో నైపుణ్యమైన మానవ వనరులకు కొరత ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి మాట్లాడుతూ… భాగ్య నగరం ఊరికే అభివృద్ధి చెందలేదనీ, దాని వెనక అలుపెరుగని కృషి ఉందని గుర్తు చేశారు. పట్టుబట్టి హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకొచ్చామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అంతే పట్టుదలతో సాధించామన్నారు. ఈరోజు హైదరాబాద్ ఒక నాలెడ్జ్ హబ్ గా ఉందంటే కారణం అది తమ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమన్నారు.
ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆంధ్రాకు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా అత్యంత చొరవ తీసుకోవడం వల్లనే చిత్తూరులో హీరో మోటార్స్ వచ్చిందనీ, కియా మోటార్స్ వచ్చినప్పుడు నీటి సమస్య ఉండేదనీ, ఆరునెలల్లో ఆ సమస్య అధిగమనించి హంద్రీనీవా ద్వారా నీళ్లిచ్చామన్నారు. జనవరిలో కియా మోటార్స్ కార్లు రోడ్ల మీదికి రాబోతున్నాయన్నారు. పరిశ్రమలకు కావాల్సిన సదుపాయాలతోపాటు, స్థానికంగా ప్రభుత్వోద్యోగుల చొరవ కూడా తోడు కావడం వల్లనే ఇంత త్వరగా ఇవన్నీ సాధ్యమయ్యాయని మెచ్చుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి సిటీలను అభివృద్ధి చేస్తున్నామనీ, రాబోయే రోజుల్లో యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు లభించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో అమరావతి ఉంటుందనీ, విశాఖ అందమైన బీచ్ సిటీగా తయారౌతుందనీ, తిరుపతి లేక్ సిటీగా తయారౌతుందన్నారు చంద్రబాబు. గ్రామ స్థాయి వరకూ క్లీన్, స్మార్ట్ విలేజ్ లుగా అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు.
ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నారనీ, తన నమ్మకం ప్రజలపై ఉందన్నారు. అలాంటప్పుడు, వచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విభజన తరువాత రాష్ట్రంలో నెమ్మదిగా అభివృద్ధి మొదలౌతోందనడానికి ఇదొక ఉదాహరణగా చూడొచ్చు. ఉద్యోగాల కల్పన రేటు నెమ్మదిగా పెరుగుతోంది. పరిశ్రమలు రావడం, పనులు ప్రారంభం కావడం, ఉద్యోగాల కల్పన… ఇవన్నీ కచ్చితంగా కొంత సమయంతో కూడుకొన్న పనులు. ఫలితాలు రావడం కూడా ఇప్పుడు నెమ్మదిగా మొదలైందనే సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇక, ఎప్పుడూ ఏదో ఒకటి విమర్శించాలనే నెగెటివ్ మైండ్ సెట్ తో ఉన్నవారికి.. ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్న ప్రోత్సాహకర వాతావరణం అర్థం కాదు, అది వేరే విషయం!