కడప స్టీల్ ఫ్యాక్టరీతో రాయలసీమలో ఊహించని అభివృద్ధి జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన.. ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విభజన చట్టం అమలు చేయకుండా ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని… ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయలేదని స్పష్టం చేశారు. మోసం చేసినవారికి గుణపాఠం చెప్పాలని.. మన శక్తి సామర్ధ్యాలు చాటాలని కంపెనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు. మూడు నెలల్లో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. గతంలో ఆర్భాటంగా ఉక్కు పరిశ్రమ కోసం.. అవసరం లేకపోయినా 12 వేలు ఎకరాలు ఇచ్చారని ..వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుని రూ.1200 కోట్ల రుణాలు తెచ్చుకున్నారని చంద్రబాబు విమర్శించారు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో రూ.33 వేల కోట్లు దోచుకున్నారన్నారు. దోచుకున్న డబ్బులతో జగన్ సొంత మీడియా ఏర్పాటు చేసుకున్నారని మండి పడ్డారు.
కడపలో స్టీల్ ప్లాంట్ వస్తే ఏపీ బాగుపడుతుందని కేంద్రం ఎన్నో అడ్డంకులు పెట్టిందన్నారు. కేంద్రం లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని.. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. అన్ని వనరులు కల్పిస్తామని కంపెనీ పెట్టాలని కేంద్రాన్ని కోరాం…ఒకటి కాదు..రెండు కాదు 11 సార్లు సందేహాలు వ్యక్తం చేశారన్నారు. వైసీపీ కడప ఉక్కు కోసం వైసీపీ ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించిందా? అని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని చెప్పినా వినలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది..పన్ను మినహాయింపులు ఇవ్వాలని చెప్పాం దానికీ అనుమతించలేదన్నారు. తొలి విడతలో రూ.18 వేల కోట్లు..రెండో విడతలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెడతామని.. ఫ్యాక్టరీతో లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని చంద్రబాబు ప్రకటించారు.
రాయలసీమకు స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంటే జగన్ అండ్ కంపెనీ బాధపడుతోందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని..
ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతుల భూములకు ధరలు వస్తే తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాయలసీమకు సాగునీరు ఇచ్చామని… కృష్ణా జలాలతో రాయలసీమలో భూముల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. నిరంతర కృషి వల్లే గండికోటకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చామన్నారు. పట్టిసీమ, పోలవరానికి వైసీపీ అడ్డుపడిందని …నదుల అనుసంధానంతో మహాసంగమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే కడప జిల్లాకే 87టీఎంసీలు వస్తాయన్నారు. అనంతపురం జిల్లాలో 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి కియా కార్ల కంపెనీ తీసుకొచ్చామని.. జనవరిలో కియా తొలికారు రోడ్డుపైకి వస్తుందని ప్రకటించారు. కియా రాకుండా సీమకు ద్రోహం చేయాలని జగన్ కుట్ర చేశారని ఆరోపించారు