తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నారనీ, దారుణంగా చంపే పరిస్థితి కూడా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలానే ఉండేదా, ఉంటే ఇవాళ్ల వైకాపా ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. వృద్ధాప్య పింఛెనుని రెండువేల పైచిలుకు తాను పెంచానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారనీ, కానీ.. దాన్ని వెయ్యి నుంచి రెండు వేలు చేసింది గత టీడీపీ ప్రభుత్వమే కాదా అన్నారు.
ఈ సభలో కూడా ఎన్నికల ఫలితాలపై మరోసారి మాట్లాడారు చంద్రబాబు. అందరం ఓట్లేశామని ప్రజలు చెబుతున్నారనీ, తాము వేసిన ఓట్లు ఎటు వెళ్లిపోయాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారనీ, ఆ ప్రశ్నకు ఇప్పటికీ తన దగ్గర కూడా సమాధానం లేదన్నారు. తనకు ఒక్కోసారి అనుమానం కలుగుతోందనీ, కుటుంబాన్ని వదులుకుని రాష్ట్రం కోసం తాను చాలా కష్టపడ్డాననీ, రోడ్లు వేశాననీ మరుగుదొడ్లు కట్టించాననీ వీధి దీపాలు అన్నీ పెట్టించా అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలని రాత్రింబవళ్లూ కష్టపడ్డాననీ, ఇక్కడికి కియా మోటార్స్ కూడా తీసుకొచ్చాననీ, అయితే చివరికి ఆ సీటు కూడా గెలవలేదనీ, దీన్ని ఏమనాలో తనకు అర్థం కావడం లేదన్నారు! కష్టపడటమే నేను చేసిన తప్పా అని అన్నారు.
ఎన్నికలైపోయాయి, ప్రజాతీర్పు వచ్చేసింది. ఇప్పుడు.. ఓట్లేమైపోయాయీ అని వేదికల మీద వ్యాఖ్యానాలు చేయడం సరైంది కాదనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది. తనకీ అనుమానాలున్నాయంటే, వేరే మార్గాల ద్వారా వాటిపై నివృత్తి చేసుకోవాలి. ఎన్నికల ముందు ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయన్నారు. ఆ విషయాన్నే పరోక్షంగా చంద్రబాబు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడీ చర్చ వల్ల పార్టీకి ఏరకంగానూ ఉపయోగం ఉండదు. ఇంకోటి… నేను చేసిన తప్పేంటి అని ప్రతీచోటా మాట్లాడుతూ ఉంటే… ఇంకా ఓటమి భారం నుంచి బయటకి వచ్చినట్టుగా లేరనీ, ప్రతిపక్ష పార్టీ పాత్రలోకి టీడీపీ వచ్చినట్టుగా లేదనే సంకేతాలు వెళ్తాయి. కొత్త ప్రభుత్వం పూర్తిగా పాలన మోడ్ లోకి వచ్చేసింది. కాబట్టి, దానికి అనుగుణంగా టీడీపీ కార్యాచరణ ఉన్నట్టు ప్రొజెక్ట్ అవ్వాలి. కార్యకర్తలపై దాడుల మీద పోరాటం చేయాల్సిందే. కానీ, ఇంకా ఓట్లేమైపోయాయో అని మాట్లాడుతుంటే… పరోక్షంగా ప్రజాతీర్పును ప్రశ్నిస్తున్న సంకేతాలే రానురానూ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.