పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలమైన డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయింది. ఈ విజయానికి గుర్తుగా పోలవరం దగ్గర పైలాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… డయాఫ్రం వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తి చేసినందుకు సిబ్బందిని అభినందించారు. ఇప్పటికే కీలక మైలురాళ్లను అధిగమించామనీ, త్వరలోనే పనులు పూర్తవుతాయని చంద్రబాబు చెప్పారు. అందరి సహకారం ఉంటే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మనదేశంలోనే అతిపెద్ద డయాఫ్రం వాల్ ఇదనీ, ప్రపంచంలోనే రెండవ అతి ఎక్కువ లోతు ఉన్న ప్రాజెక్ట్ ఇదే అని సీఎం చెప్పారు. కాంక్రీటు పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. సైట్ ఇంజినీరు దగ్గర నుంచీ మంత్రిత్వ శాఖ అధికారుల వరకూ అందరూ ఒక సంకల్పంతో కసిగా పనిచేశారనీ, అందర్నీ అభినందిస్తున్నా అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ తను సోమవారం పోలవారమేననీ, ఇప్పటివరకూ 63 సార్లు వర్చువల్ తనిఖీలు చేశానన్నారు. అయితే, అప్పుడప్పుడూ కొన్ని సమస్యలొచ్చాయనీ, కేంద్రం కూడా సరిగా సహకరించని పరిస్థితి వస్తే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశామన్నారు.
ఇంత కష్టపడి ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించాయన్నారు. ముఖ్యంగా వైకాపా నేతలైతేనే ప్రాజెక్టుపై నిప్పులు గక్కుతూ విషయం చిమ్మారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయి, ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తే చూసి భరించలేకనే ఇలా చేశారన్నారు. ఒక ఏడాదిలో పోలవరం నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకెళ్తే, రాజకీయాలు వదులుకుంటామన్నారని గుర్తుచేశారు. భూసేకరణ విషయంలో కొంతమందిని రెచ్చగొట్టారనీ, కోర్టులకు వెళ్లమని ఉసిగొల్పారనీ, కానీ ఎవ్వరికీ ఎలాంటి నష్టం లేకుండా అందరికీ న్యాయం చేస్తూ భూసేకరణ చేశామన్నారు. ఇలాంటి ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షం, అడుగడుగునా అడ్డుపడుతూ, కోర్టుకు వెళ్లడం చేశారన్నారు. వారి పత్రిక ద్వారా అవినీతి ఆరోపణలు చెస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నవారంతా ఒక స్ఫూర్తితో, ఒక మంచి కోసం ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన ఎలా ఉంటుందో ఈ మధ్య కొన్ని పరిణామాలు చూస్తూనే ఉన్నాం. రాష్ట్రానికి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో కూడా కొర్రీలు పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా డయాఫ్రం వాల్ నిర్మాణం అనుకున్న సమాయానికి పూర్తికావడం మెచ్చుకోదగ్గ విషయమే. అయితే, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రం సహాయం కచ్చితంగా ఉండాలి. డిమాండ్ చేసి సాయం పొందాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక, రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఈ ప్రాజెక్టుపై ఏమాత్రం బాధ్యత లేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతసేపూ అక్కడేదో అవినీతి జరిగిపోతోందనీ, కమీషన్ల కోసమే ప్రాజక్టు నిర్మిస్తున్నారన్నదే వారి వాదన. నిజానికి, అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నట్టు అనుమానం కలిగితే చాలు, చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడేందుకు కేంద్రమే కాచుకుని ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి, డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడం.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య పోలవరం నిర్మాణంలో చోటు చేసుకున్న పురోగతిగా చెప్పుకోవచ్చు.