అవినీతిని సహించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు తరుచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అధికారిక వర్గాల్లో అవినీతి జాడ్యం అధికంగా ఉందని, వైసీపీ హయాంలో ఈ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మారాలన్నారు. అయినా, కొంతమంది అధికారులు మారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొంతమంది మంత్రుల ఓఎస్డీ, పీఎస్ , పీఏలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం ఏపీ కేబినేట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో మంత్రుల పేషిలో కొనసాగుతున్న అవినీతి వ్యవహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి హెచ్చరించినా కొంతమంది మంత్రుల సిబ్బంది ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై అవినీతి ఆరోపణలు రావడంతో అతని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ హోంమంత్రి అనిత పీఏపై ఫిర్యాదులు రాగానే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. మరికొంతమంది మంత్రుల సిబ్బందిపై ఆరోపణలు వస్తుండటంతో కేబినేట్ భేటీ సందర్భంగా సిబ్బందిపై నిఘా ఉంచడం, అవినీతిని అరికట్టే చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ కేబినెట్ సమావేశంలో మంత్రుల పేషీలపై నిఘాతో పాటు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన ఎస్ఐపీబీ ఆమోదాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి నిర్మాణ పనుల వేగవంతంపై కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.