ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ సర్కారుపై ఏ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారో తెలిసిందే. అవినీతీ అవినీతీ అంటూ ఊదరగొడుతున్నారు. మట్టి నుంచి రాజధాని వరకూ అంటూ ప్రతీచోటా చెప్పిందే చెప్తున్నారు. సరే, ఈ ఆరోపణలకీ విమర్శలకీ ఆధారాలేమైనా చూపిస్తున్నారా అనేది వేరే చర్చ. ఈ విమర్శలూ ఆరోపణలపై టీడీపీ నుంచి ఇంతవరకూ గట్టి ఎదురుదాడి అంటూ మొదలు కాలేదనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో జగన్ గురించి ప్రస్థావిస్తున్నా… కొన్ని వ్యాఖ్యలకే చంద్రబాబు పరిమితమౌతూ వచ్చారు. అయితే ఇకపై, ఒక వ్యూహం ప్రకారం భాజపాపైనా, వైకాపాపైనా ఎదురుదాడికి సిద్ధమౌతున్నట్టున్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆ తరువాత వైకాపాపై ఎదురుదాడి అనే వ్యూహంతో ఉన్నట్టున్నారు.
అమరావతిలో సీఎం మాట్లాడుతూ… సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే నాయకుడు అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో ఐదో బడ్జెట్ వరకూ వేచి చూశాకనే పోరాటం మొదలుపెట్టామన్నారు. ఆంధ్రాకి న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం ఉండాలనీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై గతంలో కూడా టీడీపీ సర్కారు పోరాటం చేసిందన్నారు. 30న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఏపీకి ఎక్కడైతే మోడీ హామీలు ఇచ్చారో, అక్కడే అన్ని విషయాలనూ చెబుతా అన్నారు. వైకాపా గురించి మాట్లాడుతూ… తనను విమర్శిస్తున్న వైకాపా నేతలు గొప్పగా చెప్పుకునే వైయస్ హయాంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. దాదాపు 14 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, విద్యుత్ సరిగా ఇవ్వకపోవడంతో రాత్రిపూట పొలాలకు వెళ్తూ జరిగిన ప్రమాదాల్లో నాలుగు వేలమంది మరణించారన్నారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారనీ, కరెంటు కోతల వల్ల లక్షా ఐదు వేల పరిశ్రమలు మూతపడ్డాయనీ, 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, కాపులను బీసీల్లో చేర్చలేదనీ, ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తల్ని చేస్తామని ఇచ్చిన హామీ గురించి పట్టించుకోలేదనీ చంద్రబాబు చెప్పారు. వైకాపా, భాజపాలది రహస్య అజెండా ఇప్పుడు బహిర్గతమైందన్నారు.
ఇలా వైయస్ హయాం లెక్కల్ని ముఖ్యమంత్రి చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి లెక్కలు చంద్రబాబు చెప్పలేదు. దీంతో టీడీపీ లక్ష్యమేంటనేది అర్థం చేసుకోవచ్చు. వైయస్ హయాం చూపిస్తూ… మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామని జగన్ అంటున్నారు కదా! ఆయన ఉండగా ఎలా ఉండేది అంటూ నాటి వైయస్ పాలన ఒక స్వర్ణయుగం అన్నట్టు ప్రచారం చేస్తున్నార కదా! కాబట్టి, ముందుగా వైయస్ హయాంలో జరిగిన అంశాలపైనే ప్రచారం మొదలుపెట్టాలని భావిస్తున్నట్టున్నారు.