ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యత మొత్తం తనపై ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా కుప్పం ప్రజలకు నిత్యం టచ్ లో ఉండాలని చంద్రబాబు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. జననాయకుడు పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా కుప్పం వ్యాప్తంగా పలు చోట్ల ఆఫీసులు ఏర్పాటు చేశారు. అందులో అధికారుల్ని నియమించారు. ప్రజలు ఎవరు వచ్చినా వారి సమస్యను నమోదు చేసుకుని రిసీప్ట్ ఇస్తారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఫాలో అప్ చేస్తారు.
వ్యక్తిగత సమస్యలు అయితే తీర్చడానికి అవకాశం ఉన్న వాటిని పరిశీలిస్తారు.. అదే ప్రభుత్వం పరిష్కరించగలిగేవి అయితే వంద శాతం చేయాలని అనుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా యాప్ కూడా సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా ఆఫీసులకు వచ్చి పిర్యాదు చేయలేని వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఫోన్ చేసి చెప్పినా సమస్యను నమోదు చేసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించాలని లేకపోతే.. అది ఎందుకు పరిష్కారం కాదో.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలేమిటో స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు ఈ జననాయుకుడు ప్రోగ్రామ్ను పరిశీలించారు. కొన్ని మార్పు చేర్పులు చేశారు.
చంద్రబాబునాయుడు గతంలో కొంత మంది నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పేవారు. వారి వల్ల అనేక సమస్యలు వచ్చాయి. దీంతో ఈ సారి ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు ఎన్నికల బాధ్యతలు ఇచ్చారు. ఆయన అక్కడే ఉండి నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు టీడీపీ క్యాడర్ ను సమన్వయపరుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు.