నేను చేసే అభివృద్ధి పనినీ ప్రతిపక్షనేత జగన్ అడ్డుకుంటున్నాడు, అందుకే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలన్న నా ప్రయత్నాలు ఫలించటం లేదు అన్నది చంద్రబాబు రెగ్యులర్ డైలాగ్. అనుభవశూన్యుడు, ఏమీ చేతకానివాడు అని అదే జగన్‌ని అస్తమానూ విమర్శిస్తూ ఉంటాడు చంద్రబాబు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామి. నరేంద్రమోడీతో ఆయనకున్న బంధం గురించి ఆయనే చాలా సార్లు చెప్పుకున్నారు. మరోవైపు ఆత్మలాంటి వెంకయ్యనాయుడు ఉండనే ఉన్నాడు. రాష్ట్రంలో చంద్రబాబుకు పూర్తి మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును అడ్డుకునేంత సీన్ జగన్‌కి ఎలా ఉంటుంది? జగన్ మనుషులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు చంద్రబాబు. జగన్‌కి నిజంగా అంత సీనే ఉండి ఉంటే పబ్లిక్‌గా దొరికిపోయిన ఓటుకు నోటు కేసు విషయంలో అయినా చంద్రబాబును ఇబ్బంది పెట్టి ఉండేవాడు. కనీసం తనను తాను అయినా జైలుకు వెళ్ళే పరిస్థితులు రాకుండా చేసుకుని ఉండేవాడు. కోర్టుల దగ్గర చంద్రబాబు ‘రాజకీయాలను’ టచ్ చేసేంత సీన్ జగన్‌కి లేదు అన్నది నిజం. మరి ఎందుకు జగన్‌ని ఆడిపోసుకుంటూ ఉంటాడు చంద్రబాబు? దట్ ఈజ్ బాబు పాలిట్రిక్స్. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తిగా లేని పక్షంలో జగన్‌ని బూచీగా చూపించాలనేది చంద్రబాబు ప్లాన్.
ఇదే స్ట్రాటజీని ఇప్పుడు శాతకర్ణి సినిమాకు కూడా అప్లై చేస్తున్నారు. ఆ మధ్య ఓ సారి శాతకర్ణి విజువల్స్ కొన్ని లీకయ్యాయి. అలాగే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవో వచ్చాయన్నారు. వాటి వెనుకాల ఏదో కుట్ర ఉందని వార్తలు పుట్టించారు. బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడని అనుకూల మీడియాలో వార్తలు రాశారు. శాతకర్ణి సినిమాకు నష్టం చేయాలన్న ప్రయత్నాలు ఏవో ఖైదీ టీం చేస్తోందన్న గుసగుసలు పుట్టేలా చేశారు. థియేటర్స్ విషయంలో కూడా అల్లు అరవింద్ మాయ చేస్తున్నాడని అన్నారు. వాళ్ళే అంత చేసినప్పుడు మనం ఎంత చేయాలి అనే రేంజ్లో బాలయ్య వర్గం రంగంలోకి దిగింది. ఖైదీ రిలీజ్ డేట్‌కి పోటీగా దించాలని పంతం పట్టుకు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ విషయంలో పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు ఖైదీ సినిమాకోసం ప్లాన్ చేస్తున్న ప్రి రిలీజ్ ఈవెంట్‌ని కూడా అధికార పార్టీ రాజకీయ శక్తులు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. అదేమంటే వాళ్ళు ఇంతకంటే ఎక్కువే ఎన్నో సార్లు చేశారు అని ఎదురుదాడికి దిగుతున్నారు.
ఈ పోటీకి సంబంధించి, సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటున్న అభిమానుల గురించి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. సంక్రాంతిలాంటి పండగ సీజన్లో కనీసం మూడు పెద్ద సినిమాలకు సూపర్ హిట్ అయ్యే స్థాయి కలెక్షన్స్ ఉంటాయని, అన్ని సినిమాలూ హిట్ అవ్వాలని కోరుకుందామని ఒక సినిమా కోసం మరో సినిమాకు నష్టం చేయాలన్న ప్రయత్నాలు వద్దని చెప్పుకొచ్చారు. సినిమా అంటే చిరంజీవి, బాలకృష్ణలే కాదు కదా? ఆ సినిమాల కోసం పనిచేసిన వాళ్ళు వందలాది మంది ఉంటారు. రాజులు రాజులు యుద్ధం చేస్తే సైనికులు బలయినట్టు పెద్ద హీరోల పోరాటం చిన్నవాళ్ళకే నష్టం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఏర్పడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమ విస్తరించాలన్న ప్రయత్నాల్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలాంటి రాజకీయాలు అస్సలు చేయకూడదు.
అన్నింటికీ మించి గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్ బాగుంది. క్రిష్ కష్టం, నైపుణ్యం కనిపిస్తోంది. శాతకర్ణిని తెలుగువారందరూ ఓన్ చేసుకోవాలని క్రిష్ అభిలషిస్తున్నాడు. అది జరగాలంటే మాత్రం సినిమా చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడితే బెటర్. లేకపోతే మాత్రం బాలకృష్ణ కొన్ని సిినిమాల్లాగే ఈ సినిమా కూడా ఒక వర్గానికే పరిమితమయ్యే ప్రమాదముంది.