రాజ్యసభకు త్వరలోనే ఉపాధ్యక్ష ఎన్నిక ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో భాజపాకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో, ఇతర పార్టీల మద్దతు కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. భాజపా వ్యతిరేక పార్టీలకు అవకాశం ఇస్తూ, తెర వెనక తాము మద్దతు ఉంటామనే సంకేతాలు ఇప్పటికే రాహుల్ గాంధీ ఇచ్చారు. భాజపా మీద రాజకీయంగా పైచెయ్యి సాధించాలనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే, ప్రాంతీయ పార్టీల ఆలోచన మరోలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒకరిద్దరు జాతీయ నేతలతో చర్చించినట్టు సమాచారం.
భాజపా అభ్యర్థిని ఓడించాలంటే.. కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. అయితే, ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి ఏర్పడి, ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని బరిలోకి దింపాలనే ప్రతిపాదనను చంద్రబాబు తెర మీదకి తెస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచినా భాజపాపై విజయమే అవుతుంది. కానీ, వచ్చే లోక్ సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని… దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయనే సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి, ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా… తమ ఐక్యతను దేశవ్యాప్తంగా చాటినట్టు అవుతుందనే ఆలోచనతో చంద్రబాబు సంప్రదింపులు మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఈ నెలలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సమస్యల విషయమై కేంద్రంపై మరోసారి పోరాటం చేసేందుకు టీడీపీ నిర్ణయించింది. దీంతోపాటు, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక అంశంలో కూడా కొంత క్రియాశీల పాత్ర పోషించడం ద్వారా భాజపాపై రాజకీయంగానూ కొంత ఒత్తిడి పెంచాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హామీల విషయమై ఇతర పార్టీల మద్దతును మరోసారి కోరడంతోపాటు, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక విషయంలోనూ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఎన్నిక సందర్భంగా వైకాపా అసలు రంగు కూడా బయటపడుతుందనీ, ఆ పార్టీ భాజపాకు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయినా కుమ్మక్కు అయినట్టే అనే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే వ్యూహంలో కూడా టీడీపీ ఉన్నట్టు సమాచారం.