ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలను కట్టడి చేస్తున్నారు. అధికారం వచ్చింది కదా అని అందిన కాడికి దండుకునే ప్రయత్నాలకు చెక్ పెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన తన దృష్టికి వచ్చిన విషయాలతో నేరుగా పది మందికిపైగా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్, ఇసుక వంటి విషయాల్లో జోక్యం చేసుకుని ప్రజావ్యతిరేకత పెంచుకుంటే సానుభూతి చూపించే ప్రశ్నే ఉండదని సంకేతాలు పంపుతున్నారు.
లిక్కర్, ఇసుకపై ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు
ప్రస్తుతం కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీల నేతలు అధికారం తమదే అనుకుంటున్నారు. సంపాదనకు ఇదో మార్గం అనుకునే నేతలే ఎక్కువ. ఈ క్రమంలో పోటీ కూడా పెరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేలు నియోజకవర్గం పై పట్టు కోసమైనా ఇసుక, లిక్కర్ సహా ప్రతి విషయంలోనూ తమ మాటే చెల్లుబాటు కావాలని కోరుకుంటున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఆయా పాలసీలు సక్రమంగా అమలు కావడానికి వరకూ జోక్యం ఉంటే సరిపోతుంది. కానీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలంటేనే సమస్యలు వస్తాయి. కొన్ని నియోజకవర్గాల్లో అదే జరుగుతోంది.
కమిషన్ ఇవ్వాలని ఓపెన్ గా చెబుతున్న కొంత మంది ఎమ్మెల్యేలు
తాడిపత్రిలో ఇసుక లిక్కర్ వ్యాపారం చేసేవాళ్లు పదిహేను శాతం ఇవ్వాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దారెడ్డి గుప్పిట్లో ఉండేది. ఎంత శాతం అన్నది కాదు మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉండేది. ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి అభివృద్ధికే కమిషన్ ఇవ్వాలంటున్నారు. అయితే ఇవి శృతి మించితే ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందుకే చంద్రబాబు ఇలాంటివి వద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
టీడీఎల్పీ భేటీలో ఫైనల్ హెచ్చరికలు జారీ చేయనున్న చంద్రబాబు
కొంత మంది ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా దారి తప్పుతూండటంతో.. ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీటీఎల్పీ భేటీ పెట్టి మరోసారి హెచ్చరికలు జారీ చేయనున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల్ని ప్రభావితం చేసే అంశాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని… నిబంధనల ప్రకారం చేసుకునే వ్యాపారాల్లో పార్టీ పరమైన సహకారం అందిస్తామని.. అలాగే కార్యకర్తలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలకు సహకారం ఉంటుందని చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.