ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాలలో రెండో రోజు పర్యటించారు. మామూలుగా ఎన్నికల ప్రచారం అనగానే, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి… ఆ సభకు పెద్ద ఎత్తున జనాల్ని తరలించడం ఒకెత్తు. రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలందరికీ కలుసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు చంద్రబాబు మూడో ఎత్తు కూడా వేస్తున్నారు. అదేంటంటే.. కులాల వారీగా ప్రజలను కలుసుకోవడం! నంద్యాలలో సీఎం పర్యటన ఇలానే సాగింది. మైనారిటీలతో సీఎం సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఇవ్వాల్సిన భూమిని వైయస్ హాయాంలో ఒక కంపెనీకి కట్టెబెట్టారనీ, అక్కడి నుంచి ఆ భూములు జగన్ కంపెనీలకు వెళ్లిపోయాయని గతం గుర్తు చేసే ప్రయత్నం చేశారు. నాడు గృహ నిర్మాణ మంత్రిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి, ఈ భూకబ్జాను పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా బలిజ సంఘాలతో సీఎం భేటీ అయ్యారు. కాపులు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ జరుగుతోందనీ, న్యాయస్థానాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకుండా పటిష్ఠంగా చర్యలు తీసుకుంటున్నామనీ, ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని కులాల నుంచీ మంచి నాయకుల రావాలనీ, కాపుల బలిజ ఒంటరి తెలగ కులాల నుంచి ఇంకా రావాలని చెప్పారు. ఆర్థికంగా రాజకీయంగా ఈ కులాలను మరింత పైకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటాననీ, మంజునాథ కమిషన్ రిపోర్టు త్వరలో వస్తోందనీ, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా జగన్ పై ఉన్న అవినీతి కేసుల్ని ప్రస్థావించి, ఇలాంటి వ్యక్తి పెట్టిన పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. శిల్పా సహకార్ పేరుతో నిర్వహిస్తున్న సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఎం ఆరోపించారు. శిల్పా సహకార్ బాధితులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని అందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. శిల్పా సహకార్ లో ఉన్న డైరెక్టర్లంతా ఆ కుటుంబానికి చెందినవారే అని చెప్పారు. ఈ సహకార వ్యవస్థ అంతా అవకతవకల మయం అన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఇలా సాగింది. ఈ క్రమంలో కులాల వారీగా అందరితో సమావేశాలు అవుతూ ఉండటం గమనార్హం! ఇలా కులాలవారీ సభలు ఈ సందర్భంలో ఎందుకనేది అర్థమౌతూనే ఉంది. ఓటు బ్యాంకు రాజకీయమే కదా! దేశంలో కుల మత ప్రాంత వర్గ వర్ణ విభేదాలకు అతీతంగా పాలకులు ఉండాలని, అందరినీ సమానంగా పాలించాలని పెద్దలు అంటారు. కానీ, కుల ప్రమేయం లేకుండా, మత ప్రాతిపదిక కాకుండా ఒక ఉప ఎన్నికను కూడా ప్రముఖ పార్టీలు ఎదుర్కోలేని పరిస్థితి.. ప్చ్!