సమాచార వ్యవస్థలు కంప్యూటర్లు విశ్లేషణా ఏర్పాట్లు ఎక్కువయ్యాక పాలకపార్టీలు ప్రభుత్వాలు నిరంతరం ఏదో ఒక సర్వే చేస్తూనే వున్నాయి. . అలాటి సర్వేల కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కసిఆర్ కొందరు ఎంఎల్ఎలకు మరోసారి అవకాశం వుండకపోవచ్చని సంకేతాలిచ్చారు. తర్వాత మళ్లీ తనే సర్తుకుని సిట్టింగ్లందరూ పోటీలో వుంటారని ప్రకటించారు. ఇక ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చాలా కీలకమైన ఎ న్నికల పూర్వ సర్వే తలపెట్టారు.ఈ సర్వే ఎన్నికల విజయాలపైనే గాక పాలనా రీతులు ప్రజల సంతృప్తస్థాయి వంటి అంశాలతో వుంటుందట. నిజానికి ఇదో నిరంతర తతంగమే. అయితే ఈసారి అధికారిక నిఘా వర్గాలు ఇంటలిజెన్స్ వంటివి చాలక ప్రైవేటు ఏజన్సీకి కూడా రంగంలోకి దింపారట. ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన ఎలా వుంది? ఏ విషయాలు ఎక్కువగా పట్టించుకుంటున్నారు? రాజధాని పురోగమనంపై సంతృప్తంగా వున్నారా ? సర్వేకోసం ఇలాటి ప్రశ్నలన్నీ తయారు చేసుకున్నారు. కాపు రిజర్వేషన్ల గురించి సంక్షేమ పథకాల అమలు గురించి వివిధ కులాల కార్పొరేషన్ల గురించి అడుగుతారట. సహజంగానే 2019 విజయావకాశాలు అభ్యర్థిగా ఎవరు మెరుగు అనేదానిపై కూడా ప్రజాభిప్రాయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులను యువతను ఎలా సంతృప్తిపర్చాలనేది పెద్ద సమస్యగా పరిశీలిస్తున్నారట. ఆశ్చర్యకరమైన కొత్త అంశమేమంటే ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర తర్వాత ప్రజల్లో అభిప్రాయాలు ఎలావున్నాయనే ప్రశ్న కూడా పెట్టారు. ఎన్ని సర్వేలు చేయించినా అంతిమంగా రాజకీయ పార్టీలు తమ వంతుగా ప్రజల్లోకి వెళ్లడం సమస్యలపై మాట్లాడ్డం తప్ననిసరి కదా ఓట్లు ఎవరికి వేసేది ఆఖరులో నిర్ణయించుకుంటారు. సర్వేలు వారు చేయడమే గాక టీవీ ఛానల్లు వ్యక్తులు సంస్థలు ఇప్పటికే చేయించిన సర్వేల వివరాల కోసం కూడా పార్టీలు వెంటబడుతుంటాయి. అవి ప్రసారం చేసేలోగానే వీరు వైరల్ చేయడం, అది ఆసక్తికోల్పోవడం జరుగుతుంటుంది.