హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే తప్పులు చేస్తూ చీప్ సీఎమ్‌గా మారిపోయారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ మధ్యాహ్నం లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ, బాబు తన తప్పులను ఎదుటివారిపై రుద్దేందుకు ఏ స్థాయికైనా దిగజారేందుకు వెనకాడటంలేదని ఆరోపించారు. చంద్రబాబు నిన్న చాలా సుదీర్ఘమైన ఆత్మస్తుతి పరనింద కార్యక్రమం కొనసాగించారని అన్నారు. ఇంత చీప్‌గా ఒక సీఎమ్ మాట్లాడటం ఏపీ చరిత్రలోనే ఎప్పడూ లేదని చెప్పారు. నిన్నటి మీడియా సమావేశంలో కాపులకు తానేం చేస్తానో మాత్రం చంద్రబాబు చెప్పలేదని అన్నారు. కాపులకు ఐదు సంవత్సరాల్లో ఐదువేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో చెప్పలేదా అని అడిగారు. చంద్రబాబు ప్రతి కులాన్నీ, వర్గాన్నీ, మతాన్నీ మోసం చేశారని ఆరోపించారు. తానన్న మాటలనే మరిచి కాపువర్గం ఆగ్రహానికి గురైన చంద్రబాబు గద్దే దిగే రోజులు త్వరలోనే రానున్నాయని జగన్ జోస్యం చెప్పారు.