వైకాపా అధినేత జగన్ రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినవారు, కాపుల రిజర్వేషన్లు సాధ్యం కాదంటూ తమకు సంబంధం లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం పరిధిలో ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయన్నారు. విశాఖ జిల్లాలో జరిగిన గ్రామదర్శినిలో సీఎం మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అన్యాయం చెయ్యదని సీఎం చెప్పారు.
వైకాపా అవగాహన లేని పార్టీ అన్నారు. శుక్రవారమైతే ఆయన కోర్టుకు వెళ్లాలి, బోనులో నిలబడాలి, దాని కోసం గురువారం మధ్యాహ్నమే వెళ్లిపోతుంటారన్నారు! దినానికి ఒక కిలోమీటరో రెండు కిలోమీటర్లో నడుస్తారన్నారు! చేస్తున్న పనిలో నీతీ నిజాయతీ చిత్తశుద్ధి లేదని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, ఎన్డీయేకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.
భాజపాపై విమర్శలు చేస్తూ.. రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా వారికి పడే పరిస్థితి ఉండదన్నారు. మోసం చేసిన ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. వైయస్సార్ సీపీ, పవన్ కల్యాణ్ ను ప్రోత్సహిస్తూ మోసం చెయ్యాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి తోడౌతుందన్న ఉద్దేశంతోనే ఎన్నికల ముందు భాజపాతో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు మరోసారి చెప్పారు. కానీ, అడుగడుగునా మోసం చేశారన్నారు. రాజ్యసభలో రైల్వే జోన్ ఇస్తామంటారు, సుప్రీం కోర్టులో ఇవ్వలేమని అఫిడవిట్ వేస్తారన్నారు. పూటకొక మాట మార్చున్న భాజపా నాయకులు.. ఎవరిది యూటర్నో వారే చెప్పాలన్నారు. నాడు పొత్తు పెట్టుకున్నా, నేడు విభేదించినా అంతా తెలుగుజాతి కోసమే తప్ప ఇంకోటి కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఈరోజున మనకు ప్రత్యేకహోదా అవసరం. కాబట్టే, రాజలేని పోరాటం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజున టీడీపీ చేస్తున్నది ధర్మపోరాటమనీ, నీతీ నిజాయతీలతో చేస్తున్నామని చెప్పారు.
జగన్ పాదయాత్రపై ముఖ్యమంత్రి ఒక రేంజిలో విమర్శలు గుప్పించారనే చెప్పాలి. గతంలో ఇంతగా మాట్లాడింది లేదు. నిజానికి, ప్రతీ గురువారం మధ్యాహ్నమే జగన్ పాదయాత్ర ముగుస్తుంది. కొన్ని సందర్భాల్లో గురువారం మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ లో ఉంటారు. శుక్రవారం కోర్టు. శనివారం నాడు మళ్లీ కొన్ని గంటలే యాత్ర సాగుతుంది. జగన్ యాత్ర నత్తనడక సాగుతోందనేది వాస్తవం. అందుకే, అనుకున్న గడువు కంటే ఇంకొన్నాళ్లపాటు అదనంగా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే, దీన్ని జగన్ ఇటీవల ఎలా చెప్పుకున్నారంటే… అడుగడుగునా ప్రజల అభిమానం తనను కదలనీయడం లేదనీ, అందుకే కాస్త ఆలస్యంగా తన యాత్ర సాగుతోందని కవర్ చేసుకున్నారు!