తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు కంటే ముందే జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బుధవారం నుంచి టూర్లు స్టార్ట్ అవుతాయి. తెలుగుదేశం పార్టీ పెరిగిన ధరలు, పెంచిన పన్నులకు వ్యతిరేకంగా “బాదుడే బాదుడు” పేరుతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు మొదటగా జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది.
5 వ తేదీ భీమిలి నియోజవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడి వరం నియోజవర్గం కోరింగ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రం లోని మూడు ప్రాంతాలలో ఈ పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. మహానాడు వరకు పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైన తర్వాత మొదట్లో జిల్లాల పర్యటనకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం వివిధ రూపాల్లో అడ్డుకుంది.
ఓ సారి విశాఖ ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపారు. చాలా సార్లు ఆయన పర్యటనలకు అటంకాలు కల్పించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పర్యటనలు సాధ్యం కాలేదు. మహానాడులోపు మూడు ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. మరో వైపు లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలని ఇప్పటికే నిర్ణయంచారు.