హిందీ తమిళం తర్వాత ఒక భాషకు రెండు రాష్ట్రాలుండే పరిస్థితి తెలుగుకే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున తెలుగు మహాసభలను తలపెట్టింది. కొంతమంది తెలంగాణ భాష అనే పేరుతో జరపాలని సూచించినా ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరించలేదని చెబుతున్నారు. ఆయన వైఖరి సరైందే. తెలుగు భాషలో తెలంగాణకు ఘన చరిత్ర వుందని మరుగుపడిపోయిందని చెప్పడం ఆయన వ్యూహం ఉద్దేశం కావచ్చు. ఈ విధంగా తెలంగాణలోని తెలుగు వారందరిని అభిమానం చూరగొనే ప్రయత్నం చేయొచ్చు. అయితే సభలు దగ్గర పడుతున్నకొద్ది ప్రచారంలోనూ ప్రభుత్వ ప్రకటనలలోనూ తెలంగాణ కోణం ఎక్కువ కావడం సహజంగానే జరుగుతున్నది. ఈ సభలకు తెలుగు వారందరినీ పిలుస్తామంటున్నా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిర్దిష్టంగా ప్రస్తావిస్తున్నట్టు కనిపించదు. గతంలో కెసిఆర్ నిర్వహించిన యాగానికి చంద్రబాబును ఆహ్వానించడం పెద్ద తతంగంగా నడిచింది. దానికంటే కూడా అమరావతి శంకుస్తాపనకు కెసిఆర్‌ను ఆహ్వానించిన సందర్భంతో దీన్ని పోల్చవచ్చు. భాషపైనా అనేక వివాదాలు వున్న నేపథ్యంలో కూడా ప్రారంభోత్సవం లేదా లాంచనప్రాయమైన సందేశాల వంటి వేదికపై చంద్రబాబు పాల్గొనవచ్చు.మరి నిజంగా అది జరుగుతుందా లేదా అన్నది ఇప్పటికి ఇదమిద్దంగా చెప్పడం లేదు. ఈ లోగా నదీ జలాల నుంచి సినిమా అవార్డుల వరకూ ఉభయ ప్రభుత్వాలూ వేడివేడిగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి తెలుగు భాష ప్రశంసలో గొంతు కలిపితే మంచిదే.