తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకూ కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. నిన్న ఉదయమే చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు పాజిటివ్‌గా తేలింది.
దీంతో ఆయన ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. తాజాగా కుటుంబసభ్యులకూ సోకినట్లుగా తెలుస్తోంది. గత రెండు వేవ్‌లలో వారికి కరోనా సోకలేదు. మూడో వేవ్‌లో మాత్రం అందరికీ పాజిటివ్‌గా తేలుతోంది. చంద్రబాబు ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురైన సందర్బంగా ఆ గ్రామంలో పర్యటించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఈ సందర్భంగా ఆయనకు వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
గత రెండు విడతల్లో కరోనా బారిన పడని వారందరూ ఈ సారి వైరస్ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎక్కువగా అలాంటి వారికే పాజిటివ్ వస్తోంది. వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ వైరస్ సోకుతోంది. అయితే కరోనా ప్రభావం తక్కువ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో పధ్నాలుగు రోజులు క్వారంటైన్ ను ఇప్పుడు ఏడు రోజులకు తగ్గించారు. లక్షణాలు లేకపోతే టెస్టులు కూడా అవసరం లేదంటున్నారు.