ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలంటే దానికి సంబంధిత శాఖలు అనుమతులు అవసరమని కేంద్రమంత్రులు తరచుగా చెపుతుండటం అందరూ విన్నారు. అంటే దానిపై రాజకీయంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కానీ రాష్ట్ర విభజన రాజకీయ నిర్ణయమే తప్ప పాలనాపరమయిన నిర్ణయం కాదు. తెలంగాణా కోసం చిరకాలంగా సాగుతున్న ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన చేసినట్లు పైకి కనబడుతున్నా, రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణాలోనయినా తిరిగి అధికారంలోకి రావచ్చుననే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ అందుకు పూనుకొంది. అందుకు ఆంద్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనుక వారిని శాంతింపజేసి అక్కడ కూడా ఎన్నికలలో గెలవాలనే తాపత్రయంతోనే చివరి ప్రయత్నంగా చివరి నిమిషంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది. అంటే అదీ రాజకీయ నిర్ణయమేనని స్పష్టం అవుతోంది.
ఒకవేళ రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది కనుకనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనుకోని ఉంటే దానిని కూడా విభజన చట్టంలో చేర్చి ఉండేది. కనీ చేర్చలేదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కొన్ని అర్హతలు, లక్షణాలు ఉండాలని ఆర్ధిక సంఘం చెపుతోంది. కానీ ఏపీకి అవేవీ లేవని కనుకనే ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖలో తెలియజేసారు. ఈ విషయం పదేళ్ళపాటు దేశాని పాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలియదనుకోలేము. అందుకే చేర్చలేదని భావించాలి. దానిని విభజన చట్టంలో చేర్చమని ఆనాడు వెంకయ్యనాయుడు ఎంత మొత్తుకొన్నా చేర్చలేదు. కానీ సాంకేతిక, రాజకీయ కారణాల వలన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసినా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎందుకంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు దండుకోవడానికేనని అర్ధమవుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా హామీని రాజకీయ నిర్ణయమనుకొంటే, ఇప్పుడు బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ కూడా రాజకీయ నిర్ణయమే. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం బీహార్ కి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది. కనుక సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెపితే అదొక కుంటిసాకు మాత్రమే అనుకోవలసి ఉంటుంది.
కనుక బీహార్ ప్రకటన నేపధ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాతో బాటు రూ.1.50 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి కూడా ఇమ్మనమని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరబోతున్నారు. దాని కోసం అధికారులు రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను, ప్రత్యేక హోదా తదితర అందలపై జరుగుతున్నా జాప్యంపై ప్రజల అభిప్రాయాలను, ఆగ్రహాన్ని తెలియజేసే మీడియా వార్తల క్లిప్పింగులను అన్నిటితో కలిపి 200 పేజీలతో కూడిన ఒక నివేదికను తయారు చేసారు. దానిని ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన చేతిలో పెడతారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించగలిగినప్పుడు, ఎన్నికలలో ఏపీ ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రూ.1.50 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి ఇమ్మనమని కోరబోతున్నారు. మరి మోడీ మంజూరు చేస్తారో లేక ఆర్ధిక సంఘం పాటనే మళ్ళీ అందుకొంటారో చూడాలి.