ఏపీ ప్రజల మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక తిరుగులేని సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆయన సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రెండు మూడురోజుల్లో పూర్తిచేసి.. నిర్ణయం ప్రకటించాలని చంద్రబాబునాయుడు అధికారుల్ని ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. ఇసు మాఫియా దోపిడీలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేయడం మాత్రమే కాదు, ఇసుక దందాలతో తెదేపా నాయకులు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్న వైకాపా నాయకుల నోర్లకు తాళాలు వేయడానికి కూడా చంద్రబాబు ఒకే దెబ్బతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పాతకాలంలో అయితే ఇసు అవసరం ఉన్న ప్రజలకు ఉచితంగానే దొరికేది. అందుబాటులో ఉన్న చోటనుంచి ఎద్దులబండ్లు, ట్రాక్టర్లకు కావాల్సిన అద్దె మాత్రం చెల్లించి తమ తమ నిర్మాణ పనులకు తెచ్చుకునే వారు. కానీ ఇసు తీరువాలకు ధరలు నిర్ణయించి ప్రభుత్వాలు దాన్ని వ్యాపారంగా మార్చిన తర్వాత.. మాఫియా ఆగడాలు మొదలయ్యాయి. ఒక పర్మిట్ మీద అనేక బండ్లు తోలేయడం.. పోలీసులు అరెస్టులు, దాడులు చెలరేగిపోవడాలు.. హత్యలు కూడా సాధారణం అయిపోయాయంటే అతిశయోక్తి కాదు.
పార్టీలతో ప్రమేయం లేకుండా.. అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఊర్లలో మద్యం సిండికేట్లుగా ఏర్పడినట్లే ఇసుకు మాఫియాలుగా కూడా పార్టీ రహిత మైత్రితో అవతారమెత్తి దోచుకోవడమూ రివాజుగా మారింది. డ్వాక్రా సంఘాలకు ఈ ఇసుక తీరువాలను కేటాయించి.. సంఘాలు బలోపేతం చేయాలనుకున్న చంద్రబాబు ఆలోచన కూడా ఆచరణలో మాఫియా బారిన పడి, స్థానిక నేతల దందాలకు బలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉచిత ఇసుక ఇవ్వాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల జనంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది.