ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఊహించలేం! దాదాపు ఏడాదిపాటు చంద్రబాబుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి తెలిసిందే. ఇక, ఎన్డీయేతో టీడీపీ తెగతెంపులు చేసుకుంది కాబట్టి… ఏపీ సీఎంతో ఇప్పట్లో వన్ టు వన్ భేటీకి మోడీ అంగీకరిస్తారని కూడా ఎవ్వరూ ఊహించరు. విచిత్రం ఏంటంటే.. ప్రధానిగా అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలన్న స్ఫూర్తిని వదిలేసి, కేవలం ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా వారికి అనుకూలంగా లేనివారిని మోడీ దూరం పెట్టడం శోచనీయం!
ఈ నెల 16న ఢిల్లీలో నీతీ ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరగబోతోంది. నీతీ ఆయోగ్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సభ్యులు. కాబట్టి, ఈ సమావేశంలో మోడీ, చంద్రబాబు చాలాకాలం తరువాత ఎదురుపడనున్నారు. ఎన్డీయే నుంచి తెగతెంపులు చేసుకున్నాక.. వారిద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్న తొలి సందర్భం ఇదే. అయితే, ఈ కార్యక్రమాన్ని కేంద్రాన్ని నిలదీసేందుకు, పార్లమెంటు సమావేశాల తరువాత దొరికిన మరో అవకాశంగా మార్చుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ఈ వేదికపై నిలదీయాలని సీఎం భావిస్తున్నారు. దీని కోసం శాఖల వారీగా కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి వివరాల నివేదకల్ని సిద్ధం చేయాల్సిందిగా అధికారులను కోరారు. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, కేంద్ర పథకాల కింద ఇస్తున్న కేటాయింపుల గురించి ఈ భేటీలో సీఎం నిలదీయబోతున్నారు.
నీతీ ఆయోగ్ రాజ్యంగబద్ధ సంస్థ అనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం తగదని ఈ సందర్బంగా చంద్రబాబు అధికారులతో వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్రాల ఆదాయం పన్నుల కేటాయింపుల పంపిణీని సరిగా చూడాల్సిన బాధ్యత వారికి ఉందనీ, కానీ నీతీ ఆయోగ్ కూడా కేంద్రం విధించిన నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలని ఆదేశించడం సరికాదని సీఎం అన్నారు. శనివారం ఢిల్లీలో జరగబోతున్నభేటీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు సీఎం. గడచిన రెండ్రోజులుగా ప్రధాని మోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా ఏపీ సర్కారు మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు వల్లనే ఏపీ అభివృద్ధి చెందలేని వారు చెప్పడం, కేంద్రం ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేశామని వ్యాఖ్యానించడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో శనివారం జరగబోతున్న సమావేశం కాస్త వాడీవేడిగానే ఉండే అవకాశం ఉంది.