నవ్యాంధ్ర పునాదులను స్ట్రాంగ్ గా వేశా…! ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెడతా..! 2029 ప్రణాళికలు అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి చేస్తున్నారు కానీ… ఇప్పుడు ఓటర్లు ఎవరికీ.. ఏపీ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న అవసరం లేదు. ఇప్పుడు అందరూ తమకేమీ వచ్చిందనే ఆలోచిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ సంక్షేమం పేరుతో.. ప్రజలకు పప్పుబెల్లాలు పెట్టి.. ఓట్లు దండుకోవడం అలావాటైన తర్వాత.. అవన్నీ.. ఎన్నిక.. ఎన్నికకు.. కొత్త స్థాయిని అందుకుంటోంది. తెలంగాణ ఎన్నికల్లో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా వ్యక్తిగత లబ్ది చేకూర్చిన కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయింది. గొర్రెల పంపిణీ సహా రైతు బంధు వరకూ అనేక పథకాలు ఓట్లు తెచ్చి పెట్టాయి. అదే సమయంలో పెన్షన్లు కూడా ప్లస్ అయ్యాయి.
ఈ విషయాన్ని అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెన్షన్ల విషయంలో మరింత అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎన్నికలకు ముందే పెన్షన్లు పెంచాలనుకుంటున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కాకుండా… సంక్షేమం కోసమే .. నాలుగున్నరేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని మూడో శ్వేతపత్రం విడుదల సమయంలో ప్రకటించిన చంద్రబాబు.. పెన్షన్ల విషయంలో తన ఆలోచనలు కూడా బయటపెట్టారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు.. కొత్తగా మరికొంత మందికి ఇచ్చే ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వ లక్ష్యం అందర్నీ ఆదుకోవడమేనన్నారు.
ఓటర్లకు వ్యక్తిగత లబ్ది చేకూరిస్తే… ఓట్లు కచ్చితంగా వస్తాయన్న అంచనాలో రాజకీయ పార్టీలు ఉంటున్నాయి. ఉప్పు తిన్నందుకు.. ఒక్క ఓటు వేస్తే పోలా అన్న భావన కూడా.. లబ్దిదారులకు వస్తుందనే అంచనా రాజకీయ పార్టీల్లో ఉంది. అందుకే.. తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినప్పటికీ… ప్రభుత్వ పథకాల లబ్దిదారులే… టీఆర్ఎస్ను గెలిపించారన్న ప్రచారం ఉంది. ప్రతి ప్రభుత్వ లబ్దిదారుని వివరం.. అభ్యర్థులకు అందించిన కేసీఆర్.. వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అడగాలని ఆదేశించారు. ఆ ప్రకారం ముందుకు వెళ్లిన టీఆర్ఎస్ అభ్యర్థులకు విజయం సొంత మయింది. చంద్రబాబు కూడా అదే ప్లాన్ లో ఉన్నారు.