ఏపికి హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పడం, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధాలు, నిరసనలు, వారి పోరు పడలేక తెదేపా కూడా కేంద్రంపై విమర్శలు, తరువాత తెదేపా వెనక్కి తగ్గడం, తెదేపాపై భాజపా విమర్శలు, మీడియాలో వాటి తెగతెంపుల కబుర్లు, ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన అన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగిపోతున్నాయి. ప్రత్యేక హోదా ప్రస్తావన రాగానే దానితో ఈ రాజకీయ పరిణామాలన్నీఒకదాని తరువాత మరొకటి వరుసగా జరిగిపోవడం సర్వ సాధారణమయిపోయింది. మళ్ళీ ఇప్పుడూ అవే జరుగుతున్నాయి.
ఈ ప్రక్రియలో చివరి పని అదే..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి హామీల అమలు గురించి ‘గట్టిగా మాట్లాడటం’ మే 17న జరుగుతుంది. ఆయన ఎంత గట్టిగా మాట్లాడారనే విషయం ప్రజలకు వివరించడానికి ‘అధికార మీడియా’ సిద్దంగానే ఉంది. అలాగే ఆయన అసలు డిల్లీ ఎందుకు వెళ్ళారో, రాష్ట్రాన్ని ఏవిధంగా నష్టపరుస్తున్నారో వివరించడానికి ‘ప్రతిపక్ష మీడియా’ సిద్దంగానే ఉంది. ఒకవేళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి హామీల అమలు గురించి మాట్లాడితే, ముఖ్యమంత్రి గట్టిగా మాట్లాడినట్లు అనే ఓ లెక్క కూడా ఉంది. అయితే కేంద్రం నుంచి హామీల అమలుపై నిర్దిష్టమయిన ప్రకటన వస్తే తప్ప ఆయన డిల్లీ పర్యటన విజయవంతం అయినట్లు అనుకోలేము.
“హోదా ఇవ్వము. అడగకపోయినా రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం వాటికి లెక్కలు చెప్పడం లేదు,” అని కేంద్రం కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నప్పుడు, ముఖ్యమంత్రి ఎన్నిసార్లు డిల్లీ వెళ్లి మొరపెట్టుకొన్నా ఫలితం ఉండకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొనే ధైర్యం చేయలేవు కనుక ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ యధాప్రకారం రాష్ట్రానికి ఒకటో రెండో వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకోవచ్చు. ఆ ఒక్కటీ తప్ప మిగిలిన హామీల అమలుపై మోడీ సానుకూలంగా స్పందించారనో లేకపోతే వాటిపై త్వరలోనే (?) నిర్ణయం తీసుకొంటారని ఆశిస్తున్నట్లో ముఖ్యమంత్రి ప్రకటనతో ఈ ఎపిసోడ్ ముగియవచ్చు. మళ్ళీ ఎప్పుడో ఎవరో దీనిని కెలికినప్పుడు మళ్ళీ ఇదే తంతు కొనసాగుతుంటుంది.