విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడానికి కేంద్రం.. పెడుతున్న ఇబ్బందులపై… రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ పోరాడింది. ఇప్పుడు.. ఆ హామీలను.. ఒక్కొక్కటిగా.. తామే నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రారంభించి… కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడేలా చేయాలనుకుంటోంది. మొన్నటికి మొన్న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు… ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారు. రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రెక్ వాటర్ పోర్టుగా రామాయం పోర్టుని నిర్మించాలని తలపెట్టారు. రామాయపట్నం పోర్టు అనేది ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కల. అక్కడ పోర్టు వస్తే… ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రజల భావన. కానీ ఇప్పటి వరకూ.. అది ప్రతిపాదనల్లోనే ఉంది. ముఖ్యమంత్రి ధైర్యం చేసి రంగంలోకి దిగారు. కేంద్రం హ్యాండిచ్చినా… తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
ఆషామాషీగా రామాయపట్నం పోర్టుకు … చంద్రబాబు శంకుస్థాపన చేయడం లేదు. నిధుల సమీకరణ ఏర్పాట్లన్నీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్ఫ్రా డెవలెప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించారు. కాకినాడ రీజియన్ పోర్టులు, మచిలీపట్నం రీజియన్ పోర్టులు నుండి వచ్చే ఆదాయాన్ని రామయంపట్నం పోర్టు నిర్మాణానికి పదేళ్ళ పాటు ఉపయోగించనున్నారు. పోర్టును 2022 నాటికి వినియోగంలోకి తీసుకురానున్నారు. 3500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రామాయపట్నం పోర్టులో నిర్మించేవాటిలో బెర్తులను కూడా పరిశ్రమలకు కేటాయించారు. రెండు బెర్తులు ఏసియా పేపర్ మిల్లుకు, రెండు బెర్తులు జిందాల్ సంస్ధకు , ఒక బెర్తు రాంకోకు కేటాయించారు. మరో మూడు బెర్తులు కమర్షయల్ గా ఉపయోగిస్తారు. మొత్తం 13 మిలియన్ టన్నుల కెపాసిటీతో పోర్టు నిర్మాణం జరగనుంది.
చెన్నై, కృష్ణపట్నంకు అతి సమీపంలో ఉన్నందున దుగరాజపట్నం పోర్టు ఆర్థికంగా అనువయినది కాదని కేంద్రం తేల్చింది. కానీ ప్రత్యామ్నాయ పోర్టును మాత్రం ఖరారు చేయలేదు. రామాయపట్నం పోర్టు వల్ల… దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. పోర్టుకు సంబంధించి అనుమతులన్నీ ఏడాదిలో వస్తాయి. శంకుస్థానపతోనే ఆగిపోకుండా.. అనుకున్న సమయంలో పోర్టు నిర్మాణం పూర్తయితే.. ప్రకాశం జిల్లా దూసుకెళ్లినట్లే..!