ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యేలోగానే జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక కూటమికి ఒక రూపు ఇచ్చే దిశగా ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు! ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా భాజపా తారుమారు చేస్తుందనే అభిప్రాయాన్ని భాజపాయేతర పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈసారి కేంద్రంలో అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న యూపీ నేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్ లతో నిన్న సాయంత్రమే లక్నోలో చంద్రబాబు చర్చలు జరిపారు. భాజపాకి ఏకపక్షంగా మెజారిటీ వచ్చే అవకాశం లేవనే అంచనాలతో, జాతీయ రాజకీయాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది.
మొన్ననే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసిన తరువాత ఎస్పీ, బీఎస్పీ నేతలను చంద్రబాబు కలుసుకున్నారు. ఆ చర్చల సారాంశాన్ని రాహుల్ ని కలిసి వివరించేందుకు చంద్రబాబు ఇవాళ మరోసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. రాహుల్ తో మీటింగ్ అయ్యాక, శరద్ పవార్ తో మరోసారి చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. వీలైతే… ఈరోజు సాయంత్రంలోగా సోనియా గాంధీతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇంతవరకూ చంద్రబాబు చేసిన ప్రయత్నాల సారాంశాన్ని సోనియాకి వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సోనియా అపాయింట్మెంట్ కోరారని సమాచారం. ఇవన్నీ ముగించుకుని ఇవాళ్ల సాయంత్రానికి చంద్రబాబు తిరిగి అమరావతికి ప్రయాణమౌతారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే లోపుగానే భాజపా వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన జాతీయ నేతల్ని ఇప్పటికే చంద్రబాబు కలిసి, చర్చించి వచ్చారు. ఓరకంగా చెప్పాలంటే… కూటమి ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్టే. అయితే, మాయావతి, మమతా బెనర్జీల స్పందన ఏంటనేదే కొంత ఉత్కంఠగా ఉంది. వీరి మద్దతును సాధించడం కోసమే చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు సఫలమయ్యాయనే అభిప్రాయం ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఉంది. అయితే, అంతిమంగా ఎన్నిక ఫలితాలు వస్తేగానీ… మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏదేమైనా, ఎన్నికల ఫలితాలకు ముందుగానే జాతీయ రాజకీయాల్లో తనవంతు ప్రయత్నం తాను చంద్రబాబు చేశారనే చెప్పాలి. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.