తెలంగాణలో వచ్చే నెల ఐదో తేదీ వరకూ… ప్రచార గడువు ఉంది. ఈ గడువులోపు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ అభ్యర్థులు నిలబడిన అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తననే టార్గెట్ చేసుకుంటూండటంతో… ధీటుగా.. సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. రాహుల్గాంంధీతో కలిసి.. ప్రచారసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. సోనియా గాంధీతో నిర్వహిస్తున్న సభలో పాల్గొనాలనే ప్రతిపాదన వచ్చినా… చంద్రబాబు తిరస్కరించినట్లు సమాచారం. సోనియాగాంధీతో వేదిక పంచుకుంటే బాగుండదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. రాష్ట్ర విభజనకు కారణమైన సోనియాను మొన్నటి వరకు నిందించిన తెలుగుదేశం నేడు ఒకే వేదిక పై కనిపిస్తే ఆంధ్రాలో తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారు.
రాహుల్ గాంధీ ఏపీ విషయంలో.. ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటున్నారు. అందువలనే రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రజాకూటమి నేతలు షెడ్యూల్ ను ఖరారు చేస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమున్న ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షో కూడా నిర్వహించే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి తాను ప్రచారం చేయడం బాగోదని తొలుత చంద్రబాబు చెప్పినప్పటికీ, ఆ తరువాత టీ టీడీపీ నేతల నుంచి, అభ్యర్థుల నుంచి ఒత్తిడి ఎక్కువ అయింది. రాహుల్ గాంధీ కూడా కూటమి తరుపున అన్ని జిల్లాలలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ ఐదు జిల్లాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, రాహుల్ గాంధీ కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
జిల్లా కేంద్రాలలో ఈ ప్రచారం తరువాత చంద్రబాబు నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు పోటీ చేసే నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పనితీరు ఏమిటో అక్కడి ప్రజలు అభ్యర్ధులను గ్రామాలలోకి రానివ్వకుండా తరిమికొడుతున్న వైనం చూస్తే తెలిసిపోతుందని తెలంగాణ తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన నాడు వంద సీట్లు వస్తాయని, టీఆర్ఎస్ విజయం ఏకపక్షంగా ఉంటుందని చెప్పిన కేసీఆర్ చంద్రబాబు ను చూసి ఎందుకంత భయపడుతున్నారని దేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు మొదట్లో ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్న చంద్రబాబును.. కేసీఆరే…బలవంతంగా రప్పిస్తున్నట్లుగా… మారింది వ్యవహారం. ..