బుడమేరు ఉగ్రరూపం కారణంగా నష్టపోయిన బెజవాడ వాసులందరికీ ఆర్థిక పరమైన మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. ముంపు ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఆయన పరిహారం ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక మద్దతు ఇస్తున్నారు. ఇది ప్రజల్ని సంతృప్తి పరుస్తోంది. తమను ప్రభుత్వం పట్టించుకుంటోందని ఆనందిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం కానీ.. దాని వల్ల జరిగే ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు… భరించవచ్చు. ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ది బెస్ట్ అన్నంతగా ప్రయత్నిస్తోంది. వరద వస్తుంది.. పోతుంది… ఎవరి బాధలు వారు పడతారు అన్నట్లుగా కాకుండా.. ప్రతి క్షణం బాధితులతోనే ఉంది. దాదాపుగా పది రోజుల పాటు చంద్రబాబు వరద బాధితులతో పాటు బురదలోనే ఉన్నారు. అంతా చక్కదిద్దిన తర్వాతే వేరే కార్యక్రమాలకు వెళ్లారు. ఇప్పుడు అందరికీ పరిహారం ఇచ్చేందుకు ప్యాకేజీ ప్రకటించారు. వారికి జరిగిన నష్టంతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువే కావొచ్చు కానీ.. ఇది వారికి ఎంతో మద్దతు నిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చంద్రబాబు మొదటి నుంచి మైక్రోలెవల్ సాయం విషయంలో ప్రత్యేక వ్యూహం పాటిస్తూ వస్తున్నారు. వారికి నిత్యావసరాలు అందేలా చేశారు. ఇళ్లను కూడా శుభ్రం చేయించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అర్బన్ కంపెనీ ద్వారి ఎలక్ట్రానిక్స్.. ఇతర వస్తువులను రిపేర్లను చేయిస్తున్నారు. వరదల్లో నష్టపోయిన సర్టిఫికెట్లను కొత్తవి ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ పూర్తయింది. నగదును ఖాతాల్లో జమ చేయడమే మిగిలింది.
గత వైసీపీ హాయాంలో ఎన్ని విపత్తులు వచ్చినా పైసా సాయం ఇచ్చింది లేదు. రెండు వేలు ఇస్తామని ప్రకటిస్తారు. కానీ ఇచ్చేది పదో.. ఇరవై మందికో. తర్వాత అందర్నీ మర్చిపోతారు. విపత్తులు వచ్చినప్పుడు ఐదేళ్ల పాటు ఏపీ ప్రజలు అనాధలుగానే మిగిలపోయారు. ఇప్పుడు తమను పట్టించుకునే ప్రభుత్వం ఉందని సంతృప్తి చెందుతున్నారు.