ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 10న లండన్ పర్యటనకు బయిలుదేరి వెళుతున్నారు. మూడు రోజులు వుంటారని సమాచారం.పెట్టుబడుల సేకరణ పేరిట ఆయన తరచూ విదేశాలకు వెళ్లడం దానిపై విస్త్రత ప్రచారం ప్రజలకు ప్రేక్షకులకూ ఆలవాటై పోయింది. అయితే విదేశాలలో ఆయన ప్రచార కార్యక్రమాలు చూసే లేదా సహకరించే ఎన్నారైలకు మాత్రం రాను రాను ఇదో సవాలుగా మారుతున్నది. అమెరికా బ్రిటన్ జపాన్ జర్మనీ వంటి దేశాలకు ఎంతోమంది విదేశీ ప్రముఖులు వస్తుంటారు. అక్కడ ప్రధానంగా వ్యాపార ప్రయోజనాలే పాత్ర వహిస్తాయి తప్ప సెంటిమెంట్లకు తావుండదు. పదే పదే వెళ్లి ప్రభుత్వం తరపున ఆఫర్లు చేసి ఆహ్వానిస్తే అనుమానించే లక్షణం కూడా విదేశీ బడా కంపెనీలకు వుంటుంది. అందరినీ కలుసుకొని సవివరంగా చర్చలు జరిపే ఆసక్తి కూడా అంతంతమాత్రమే. కనుకనే వీడియో కాన్ఫరెన్సుల వంటివాటితో సరిపెడుతుంటారు. తన పర్యటనల్లో చంద్రబాబు నాయుడు వివిధ కంపెనీల సిఇవోలతో వీడియో సమావేశం జరిపారని ఇక్కడ పెద్దగా ప్రచారం చేశారు గాని నిజానికి అవి చాలా రోటీన్ వ్యవహారాలే. ఆ సమయంలో అప్రధాన విదేశీ ఛానళ్లలో సమయం సంపాదించి ఆయనను శ్రమ పెట్టడం, దాన్నే గొప్ప విజయంగా ఇక్కడ ప్రచారం చేయడం ఒక ప్రహసనంగా మారింది. దీనివల్ల ప్రయోజనం పొందే కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని కూడా కొందరు ఎన్నారై తెలుగువారు ఆరోపిస్తున్నారు. పైగా స్వాగతాలు పలకడం, అక్కడ వారు రాకపోయినా తామే కనిపిస్తూనైనా జయప్రదమైనట్టు చూపించడం ఒక పరీక్షగా మారిపోతుందని అంటున్నారు. ఈ వయసులో ఆయన ఇంత శ్రమ పడటం అవసరమా? నిజంగా వచ్చిన పెట్టుబడులెన్ని అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పర్యటనలోనైనా కాస్త ఆలోచిస్తారా?