ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఓ భిన్నమైన చిత్రం కనిపిస్తోంది. బీజేపీని మనస్ఫూర్తిగా స్వాగతించే ఒక్క మిత్రపక్షం కూడా లేదు. ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా.. బీజేపీని.. బహిరంగంగా విమర్శిస్తున్నాయి. ఓ రకంగా చూస్తే బీజేపీ ఒంటరిగా ఉంది. ఎంత తగ్గి ఆహ్వానించినా.. దేశంలో ఒక్క పార్టీ కూడా.. బీజేపీతో జత కట్టే పరిస్థితి లేదు. అధికారం ఉంది.. వ్యవస్థలను ఉసిగొల్పుతున్నారు కాబట్టి.. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు లోపాయికారీ మద్దతుగా నిలుస్తున్నాయి కానీ.. కూటమి కట్టేందుకు సిద్ధపడటం లేదు. ఇలాంటి సందర్భాల్లో.. చంద్రబాబు రంగలోకి దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా ఏకం కాలేకపోతున్న పార్టీలను ఏకం చేసే బాధ్యత తీసుకున్నారు.
మాయవతిని కూటమిలో చేర్చితే చంద్రబాబు చాణక్యుడే..!
బీజేపీ వ్యతిరేక కూటమిలో బహుజన సమాజ్ పార్టీ కీలకం. మాయవతిని కూటమిలోకి తీసుకొచ్చి ఆమెతో వ్యవహారాల్ని డీల్ చేయడం అంత సులభం కాదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ నైపుణ్యంతో ఈ పని సులువుగానే సాధిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి ఆమెను కలిసి ముప్పావు గంట చర్చలు జరిపారు. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతు పలికారు. ఎప్పుడూ లేనిది.. వాహనం దగ్గరకు వచ్చి ఆశీర్వదించారు. కలసి పని చేద్దామన్నారు. అంటే.. కూటమిలోకి వచ్చినట్లే. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ లాంటి పార్టీలతో ఇప్పటికే కూటమి కట్టారు అదే కూటమిని జాతీయ స్థాయికి విస్తరించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కు ఇబ్బంది కలిగిస్తోంది. ఇలాంటి సమస్యలను చంద్రబాబు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
మమతా బెనర్జీని ఒప్పించగలుగుతారా..?
బీజేపీ వ్యతిరేక కూటమిలో మమతా బెనర్జీ… చాలా కీలకం. 42 పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రంలో.. ఆమె… చాలా బలంగా ఉన్నారు. అక్కడ బీజేపీ… తమదైన భావోద్వేగ అంశాలతో బలపడే ప్రయత్నం చేస్తోంది. చాలా రోజలుగా.. టీఎంసీ నేతలను… రాజ్యాంగ వ్యవస్థలతో భయపెట్టి… కేసులు పెట్టి.. కొంత మందిని పార్టీలో చేర్చుకుంది. ఈ దూకుడుని అడ్డుకట్ట వేయడానికి మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. కూటమి దిశగా.. అందర్నీ ఏకం చేసే శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అందుకే.. చంద్రబాబును ప్రొత్సహించారు. ఇక కూటమిలో ఉండనున్న మరో కీలక పార్టీ సమాజ్ వాదీ పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ బాధ్యతలు అఖిలేష్ యాదవ్ చూస్తున్నారు. జాతీయ రాజకీయాల కన్నా.. ఆయన యూపీ మీదే దృష్టి పెట్టారు. యూపీలో బీజేపీనే ఎస్పీకి ప్రధాన ప్రత్యర్థి. కాంగ్రెస్ కు దాదాపుగా ఉనికి లేదు. అందుకే చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ కూటమికి రెడీ అన్నారు. ఢిల్లీలో కలిసి మంతనాలు జరిపారు.
లెఫ్ట్ సంగతేమిటి..?
బీజేపీయేతర కూటమిలో కలవడానికి సిద్ధంగా ఉన్న మరో పార్టీ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అధినేత శరద్ పవార్ ది… కాంగ్రెస్ జీన్స్. అయితే మధ్యలో సొంత పార్టీ పెట్టుకున్నారు. రాజకీయ అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నా… ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బీజేపీ వైపు వెళ్లే పరిస్థితి లేదు. జమ్మూకశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా.. కూటమిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వామపక్షాలు కూడా… బీజేపీయేత ఫ్రంట్ లో భాగస్వామ్యం అవడానికి ఎప్పుడో సిద్ధమయ్యాయి. కాకపోతే.. సీపీఐ కాంగ్రెస్ ఉన్న కూటమిలోఉండటానికి రెడీగా ఉన్నా.. సీపీఎం మాత్రం తటపటాయిస్తోంది. దీనికి కారణం.. ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండటమే.
మోడీ, షా చూస్తూ ఉంటారా..?
ఇప్పటికైతే.. కూటమికి ఓ రూపు కన్పిస్తోంది. కానీ.. అందరూ ఏకమవుతూంటే.. మోడీ, షా చూస్తూ ఉంటారా..? అలాంటి అవకాశం ఉండదు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేస్తారు. వాళ్లేం చేస్తారు.. దానికి చంద్రబాబు విరుగుడుగా ఇంకేం చేస్తారన్నదానిపై .. అసలు రాజకీయాలు ఉండబోతున్నాయి.
—- సుభాష్