వరంగల్ ఉప ఎన్నికలలో తెదేపా-బీజేపీల తరపున ఉమ్మడి అభ్యర్ధిగా డా. దేవయ్య తరపున ప్రచారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళే సూచనలు కనబడటం లేదు. మూడు నాలుగు రోజుల క్రితం తెలంగాణా తెదేపా నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయినప్పుడు “పార్టీ పరంగా మీరు తెరాసను ఎదుర్కోండి..కానీ ప్రభుత్వపరంగా మేము తెరాస ప్రభుత్వానికి సహకరిస్తామని” చెప్పినట్లు వార్తలు వచ్చేయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయినప్పటి నుంచి ఆయన పట్ల చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చినట్లు ఇది స్పష్టం చేస్తోంది. అలాగే తెరాస మంత్రులు, నేతలు కూడా ఇదివరకులాగా చంద్రబాబు నాయుడుని పేరు పెట్టి విమర్శించక పోవడం గమనించవచ్చును.
ఒకవేళ ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా ఆయన తెలంగాణా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయవలసి ఉంటుంది. గత ఏడాదిన్నర కాలంగా బద్ధ శత్రువుల వలే పోరాడుకొన్న రెండు ప్రభుత్వాల మధ్య ఇపుడిప్పుడే సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. కనుక దానిని తన పర్యటనతో చెడగొట్టకూడదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాట్లున్నారు. బహుశః అందుకే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వచ్చి ఎన్నికల ప్రచారం చేయమని చంద్రబాబు నాయుడుని కోరినప్పటికీ, బీజేపీ అభ్యర్ధి విజయానికి తమ పార్టీ నేతలు పూర్తిగా సహకరిస్తారని హామీ ఇచ్చేరు తప్ప తను స్వయంగా వచ్చి ప్రచారం చేస్తానని హామీ ఇవ్వలేదు.
బీజేపీ అభ్యర్ధి విజయానికి తగిన వ్యూహాలు రచించుకొని వాటిని అమలు చేయడానికి, అలాగే ఇకపై తెలంగాణాలో తెదేపాని బలోపేతం చేయడానికి కూడా తెలంగాణా తెదేపా నేతలకు చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్చనిచ్చినట్లు వార్తలు వచ్చేయి. అంటే వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళకపోవచ్చునని భావించవచ్చును. కానీ ఒకవేళ మోడీ లేదా వెంకయ్య నాయుడు కోరినట్లయితే వెళ్ళవచ్చును.