భారత్కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మోదీ పట్టుదలగా ఉన్నారు. 2047 నాటికి ఈ కల సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారు. దేశం అంటే రాష్ట్రాల సమూహం. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందినట్లు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రాష్ట్రాన్ని 2047లోపు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఓ విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకున్నారు. శుక్రవారం దాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నారు.
గతంలో చంద్రబాబునాయుడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు.కొంత మంది నవ్వారు. ఆయన విజన్ 2020లో అమలు చేసిన ఎన్నో అంశాలు నేడు అభివృద్ధిలో కీలకమయ్యాయి. అప్పుడు ఎగతాళి చేసిన వాళ్లు తర్వాత పెద్దగా మాట్లాడలేదు. నిజానికి చంద్రబాబు విజన్ కొనసాగించి ఉంటే.. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకునేది .కానీ ఆయన పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో రాష్ట్రం కూడా చీలిపోయిది.
ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల కిందట వచ్చిన అవకాశంతో పునాదులు వేసినా తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని పెకిలించి వేసింది. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తారు. ఇప్పటికే వైసీపీ నేతలు చంద్రబాబు 2047 వరకూ అధికారంలో ఉంటారా అని సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు రిలీజ్ చేస్తున్న విజన్ డాక్యుమెంట్ రాష్ట్రం కోసం.. అది టీడీపీ మేనిఫెస్టో కాదు. ఎవరు వచ్చినా వాటిలోని అంశాలు ఆచరిస్తే ఏపీకి మేలు జరుగుతుంది.