ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇద్దరు చంద్రులూ ఇప్పుడు రాజకీయంగా ఒకరికి ఒకరు ఎదురెదురుగా కనిపిస్తున్నారు. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తీసుకుంటే… తెరాస ప్రచారంలో చంద్రబాబును విమర్శించడమే కేసీఆర్ ప్రధానాస్త్రమైంది. సరే, ఇది ఇక్కడితో అయిపోతుందనుకుంటే… ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టడానికి వెళ్తానంటూ కేసీఆర్ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీబీఎన్ వెర్సెస్ కేసీఆర్ అనేది ఉంటుంది. వాస్తవానికి, ఆంధ్రా రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ప్రత్యక్షంగా ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనుకోండి. ఇక, జాతీయ స్థాయి రాజకీయాల ప్రయత్నాలు చూసుకుంటే… అక్కడ కూడా సీబీఎన్ వెర్సెస్ కేసీఆర్ అన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, జాతీయ రాజకీయాలవైపు వెళ్లడం వెనక చంద్రబాబు లక్ష్యం ఒకటైతే, కేసీఆర్ ది మరొకటి!
కాంగ్రెస్, భాజపా ప్రమేయం లేని మరో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ, దాని కోసం తాను కృషి చేస్తానంటూ కేసీఆర్ బయలుదేరుతున్నారు. ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే… భాజపాయేతర ప్రభుత్వం కేంద్రంలో ఉండాలనే కోణంలో తన ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టేశారు. తెలంగాణలో తాను అనుసరించిన అభివృద్ధి వ్యూహాలు చక్కటి ఫలితాలను ఇచ్చాయనీ, మరోసారి తాను గెలవడం ద్వారా దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందన్నది కేసీఆర్ నమ్మకం. దేశానికి తెరాస అభివృద్ధి మోడల్ ఆదర్శం అనేది ఆయన విశ్వాసం.
ఇక, చంద్రబాబు నాయుడు విషయానికొస్తే… భాజపాయేతర కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు ఒక్కటే ఆయన లక్ష్యం. ఈ లక్ష్యం కూడా ఏపీ ప్రయోజనాల సాధనలో భాగంగా ఏర్పడిందనే చెప్పాలి. విభజన తరువాత అన్ని రకాలుగా ఆంధ్రాను నిర్లక్ష్యం చేసిన భాజపాను నమ్మే పరిస్థితిలో ఏపీ లేదు. కాబట్టి, భాజపాయేతర కేంద్ర ప్రభుత్వం అనేది చంద్రబాబు ప్రయత్నంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయం జాతీయ రాజకీయాల్లో అసాధ్యమనేది చంద్రబాబు అభిప్రాయం. ఫెడరల్ ఫ్రెంట్ అనే ఆలోచనకే ఆస్కారం లేదనీ, ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకే ఈ ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారంటూ ఏపీ సీఎం తాజాగా విజయవాడలో ఓ కార్యక్రమంలో విమర్శించారు. ఉన్నవి రెండే రెండు కూటములనీ… జాతీయ పార్టీ అండలేని మూడో ప్రత్యామ్నాయం సాధ్యం కాదనేది ఆయన అభిప్రాయం.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ది ఒక రకమైన ప్రయత్నం, ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడుది మరో ప్రయత్నం, ఇంకో అంచనా. ఇంకా చెప్పాలంటే… కేసీఆర్ ప్రయత్నం ఒక ప్రయోగం, చంద్రబాబు నాయుడుది అవసరం. విచిత్రం ఏంటంటే…. రాష్ట్రాల అధికారాలూ హక్కులూ పెరగాలనీ అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని కేసీఆర్ అంటుంటే, రాష్ట్రాల హక్కుల్ని హరించే భాజపాను గద్దె దించితే చాలు న్యాయం జరుగుతుందనేది చంద్రబాబు నాయుడి అభిప్రాయం. అయితే, నిన్నమొన్నటి వరకూ తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా అడ్డుకుంటోందన్న కేసీఆర్… ఇప్పుడు రాష్ట్రాలకు ప్రయోజనాలు పెరగాలనే దృష్టితో ఆంధ్రాను ఎలా చూస్తారనేది స్పష్టత లేని అంశం. మొత్తానికి, చంద్రబాబు నాయుడు వెర్సెస్ కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.