హైదరాబాద్: విజయవాడ, గుంటూరు నగరాలలో ఇళ్ళ యజమానులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ శివార్లలోని తాడిగడపలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ, విజయవాడలో అద్దెలు బాగా పెంచేశారని ప్రభుత్వోద్యోగులు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇక్కడకంటే హైదరాబాద్ బెటర్‌గా ఉందని, విజయవాడకు ఎలావస్తామని అంటున్నారని చెప్పారు. విజయవాడలో భూమి రేట్లు ఎక్కువని, అందుకనే యజమానులు ఆ భూమి ఉంటే చాలనుకుని అమ్మటం కూడా మానేసి రేట్లు కూడా పెంచేశారని అన్నారు. విజయవాడకంటే సింగపూర్ నగరంలో వ్యాపారం చేయటం తేలిగ్గా ఉందని చమత్కరించారు. భూమి విలువ పెరిగిపోయిందని, రెంట్లు పెరిగిపోయాయని, ఇలా ఉంటే ఎవరైనా వేరే ఊళ్ళకు వెళ్ళిపోతామనుకుంటారని చెప్పారు. భూములమీద, అద్దెలమీద సంపాదించాలనుకోవటం పొరపాటని, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకోవాలని సూచించారు. ఈ కారణంవల్లే విజయవాడలో పెద్దగా పరిశ్రమలు రాలేదని చెప్పారు. విజయవాడవాళ్ళు, కృష్ణా జిల్లావాళ్ళు బయటకెళ్ళి ప్రపంచమంతటా పరిశ్రమలు పెట్టారని అన్నారు.
అద్దెలు, భూముల విలువలు భారీగా పెరిగితే పెట్టుబడులు రావని విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ఇలాగైతే అందరూ రాయలసీమవైపు చూస్తారని అన్నారు. అక్కడకూడా అలాగే భూముల ధరలు, అద్దెలు పెంచితే ఇక పెట్టుబడులు పెట్టేవారు ఇతర రాష్ట్రాలవైపు చూస్తారని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను వైద్యసేవలకు కేంద్రంగా మార్చాలన్నది తన ఆలోచన అని అన్నారు.