ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేస్తున్న ప్రచారంలో, తాను జాతీయ రాజకీయాలలోకి వెళ్ళవలసిన అవసరం ఉందని, దేశాన్ని కాపాడ వలసిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉందని, 1994 నాటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి తాను ఢిల్లీ వెళ్లి చక్రం తిప్ప వలసిన పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయని ప్రచారం చేశారు. ‘సేవ్ ది నేషన్ సేవ్ ది డెమోక్రసీ’ అంటూ స్లోగన్ కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపారు. మోడీ వ్యతిరేకులం అందర్నీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చే బాధ్యత తన భుజాలమీద ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి, బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వడం లో తెలుగు వారిని మోసం చేసింది కాబట్టి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని అభిప్రాయం కలవారి నుంచి, మొదటి నుండి చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ పై సదభిప్రాయం ఉన్నవారి నుంచి ఈ ప్రచారానికి ఆ స్లోగన్ కి మంచి స్పందన వచ్చింది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు మారాయి.
నంద్యాల ‘గెలుపు సంచి’ లో లాభం, తెలంగాణ ‘ఓటమి చిల్లు’ లో పోయింది:
ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు రాజకీయం ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది తప్ప తెలంగాణలో కాదు. అయితే దశాబ్దాలుగా పార్టీ ఉన్న కారణంగా, అక్కడ ఉన్న లీడర్లను కేడర్‌ను మరి కొంతకాలం పాటు కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే క్యాడర్‌ను లీడర్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్‌తో పెట్టుకున్న పొత్తు దారుణంగా బెడిసికొట్టింది. దీంతో చంద్రబాబు చాణక్యత మీద ఉన్న నమ్మకం పెట్టుకున్న వారికి కంగుతిన్నట్టు అయింది.
2014లో చంద్రబాబు గెలిచినప్పుడు ప్రజల్లో ఆయన పాలన పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే గెలిచిన మొదటి రెండేళ్లలోనే కొద్దికొద్దిగా ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న కొద్దిపాటి ఆందోళన ఉన్న సమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లో లభించిన భారీ విజయం తెలుగుదేశం పార్టీకి గొప్ప ఊపు తీసుకుని వచ్చింది. జగన్ కి అత్యంత కంచుకోటగా భావించే రాయలసీమలో, అందులోనూ 2014 లో వైఎస్ఆర్ సీపీ గెలుచుకున్న సీటు ని అంత భారీ మెజారిటీతో గెలుచుకోవడం పార్టీకి సహజంగానే ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆ ఉత్సాహం ఆ ఊపు మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఎదురైన పరాభవం తో కొట్టుకుపోయింది.
దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రస్తుతానికి బలంగా వినిపిస్తున్న అభిప్రాయం ఏమిటంటే చంద్రబాబు వీలైనంత తొందరగా డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టాలి అన్నది.
దేశాన్ని కాదు , ముందు ‘దేశాన్ని’ కాపాడండి:
తమకు రాజకీయ ప్రయోజనాలు పెద్దగా లేని తెలంగాణ లో చేసిన ప్రయోగం వల్ల అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది ఎదురవుతుంది ఏమోనన్న ఆందోళన తెలుగుదేశం అభిమానుల లో స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం ఇప్పటికైనా వీలైనంత త్వరగా డ్యామేజీ కంట్రోల్ మొదలు పెట్టక పోతే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం వారిలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాలు అంటూ ఢిల్లీలో కాలయాపన చేస్తూ, అక్కడి రాజకీయ నాయకులతో భేటీ లకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, ఇక్కడ వైయస్ జగన్ , పవన్ కళ్యాణ్ లు ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతున్నారు. జగన్ పాదయాత్ర దాదాపు ఏడాది పాటు కొనసాగి ఇక పూర్తి కావస్తుంటే, ఇటు పవన్ కళ్యాణ్ కూడా, మీడియాలో పెద్ద కవరేజ్ రాకపోయినప్పటికీ, అగ్ర చానెళ్లలో డిబేట్ లలో విశ్లేషకులు పవన్ కళ్యాణ్ పార్టీని పరిగణించకుండా విశ్లేషిస్తున్న ప్పటికీ, చాపకింద నీరులాగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. వ్యూహాత్మకంగా తన బలం ఉన్న ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ వెళ్తున్నారు. ఆటు టిఆర్ఎస్ కూడా బాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానిస్తోంది.
ఇంత కీలక సమయంలో, రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితిని పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలపై చంద్రబాబు కేంద్రీకరించడం ఆయన అభిమానుల లో అసహనానికి కారణం అవుతోంది. అందుకే తెలుగుదేశం అభిమానుల నుంచి ముక్తకంఠంతో వస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, చంద్రబాబు గారూ, దేశాన్ని తర్వాత కాపాడుదురు గానీ, ముందు మన ‘తెలుగు దేశాన్ని’ కాపాడండి అని. మరి చంద్రబాబు గారు తమ్ముళ్ల విజ్ఞప్తిని పట్టించుకుంటారా లేకపోతే జాతీయ రాజకీయాలంటూ, చక్రం తిప్పడానికి ఢిల్లీ వెళ్లి ఆ చక్రం కింద పడి నలిగి పోతారా అన్నది తెలియాలంటే మరో ఆరు నెలలు ఆగాలి.