ప్రజలు ఎందుకు గెలిపించారో తెలియని వ్యక్తి పగ్గాలు అందుకుంటే ఓ రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుందో దానికి పక్కా సాక్ష్యం ఆంధ్రప్రదేశ్. గత ఐదేళ్ల కాలంలో ఏపీకి జరిగినంత విధ్వంసం చరిత్రలో మేర రాష్ట్రానికీ జరిగి ఉండదు. కులం, మతం, పార్టీ మత్తు వదిలి కేవలం భవిష్యత్ కోసం చూసే వారికి ఈ విధ్వంసం ఐదేళ్లుగా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మిగిలిన వారికి గణాంకాలతో చెప్పేందుకు.. చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇందులో ఉన్న వివరాలు తీరిగ్గా తెలుసుకునే అంత వెసులుబాటు ఎంత మందికి ఉంటుందో కానీ తెలుసుకుంటే మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురి కావడం ఖాయం. ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని పాతాళంలోకి తీసుకెళ్లారో అర్థమైపోతుంది.
ఐదేళ్లలో దోపిడీని ప్రజల ముందు పెడుతున్న శ్వేతపత్రాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకూ విద్యుత్, అమరావతి, భూదోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ప్రతీ దాంట్లోనూ జరిగిన విధ్వంసం.. దోపిడీ చూస్తే.. ఏపీ రాష్ట్రాన్నే కాదు.. ప్రజల్ని కూడా వచ్చే కొన్ని దశాబ్దాల పాటు అడ్డగోలుగా దోచుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ రంగంలో లక్షన్నర కోట్ల దోపిడికీ వేసిన పక్కా ప్లాన్… చేసిన నష్టం చూస్తే.. ఏపీలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ కష్టానికి.. నష్టానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇక సొంత రాష్ట్ర రాజధానిపై కుట్ర చేసిన సీఎంను ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. ఒక్క ఏపీలో తప్ప. చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించిన నిర్మాణాలను పక్కన పెట్టిన వైనం … ధ్వంసం చేసిన తీరు చూస్తే.. ప్రజాధనంపై, రాష్ట్రంపై కనీస బాధ్యత ఉన్న వారు ఎవరైనా అని చేస్తారా అని ఆశ్చర్యపోక తప్పదు.
రాష్ట్ర వనరులే కాదు .. ప్రజల్ని నిలువు దోపిడి చేసిన ఐదేళ్ల పాలన
భూ దోపిడీగా చంద్రబాబు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న ప్రతి ఒక్కటీ దేశంలో దోపిడీ దొంగల పాలన జరిగిందని సాక్ష్యాలతో సహా నిరూపితమవుతోంది. అడ్డగోలుగా దోచుకోవడమే పనిగా పాలన సాగింది. ఐదేళ్ల పాటు వారు చేసింది అదే. బయటకు రానివి ఇంకా ఎన్నో ఉన్నాయని ఈ శ్వేతపత్రం విడుదల తర్వాత సామాన్యులు చెప్పుకుంటున్నారంటే.. వైసీపీ నేతలు .. బడే చోర్.. చోటా చోర్ అన్నట్లుగా కింది స్థాయిదాకా డిజిగ్నేషన్లు మార్చుకుని విచ్చలవిడి దోపిడీకి పాల్పడ్డారని అర్థమవుతుంది. చంద్రబాబు ప్రభుత్వ ఆస్తుల గురించే చెప్పారు. ప్రైవేటు ఆస్తుల దోపిడీ ఎంత ఉంటుందో లెక్కలేయడం కష్టం. ఫలానా పేరుతో అక్రమాలు జరిగాయని నోటీసులు ఇవ్వడం.. తృణమో.. పణమో చేతుల్లో పెట్టి ఆ ఆస్తిని లాగేసుకుని నోటీసుల్ని ఉపసంహరించుకోవడం అనేది ఐదేళ్ల పాటు జరిగిన ప్రక్రియ.
చట్టపరంగా కూడా శిక్షించాల్సిందే !
ఎలా నమ్మారో.. ఎందుకు నమ్మారో తెలియదు కానీ ఐదేళ్ల పాటు ఓ క్రిమినల్ ఆలోచనలో ఉన్న దోపిడీ దారుడిచేతిలో రాష్ట్రం పడింది. తాను జనాల ఆస్తులన్నీ దోచేసుకుని ఓటు బ్యాంకుకు చిల్లర పడేస్తే వారే తనకు ఎగేసుకుని వచ్చి ఓట్లేస్తారని అనుకున్నారు. కానీ జరిగిన నష్టం ఏమిటో ప్రజలు గుర్తించారు. చిత్తుగా ఓడించారు. కానీ అంతలా చట్ట విరుద్ధంగా పాలన చేయాలని.. దోపిడీ చేయాలని ప్రజలు వారిని గెలిపించలేదు. అందుకే ఇప్పుడు చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తీసుకోవాలి కూడా. లేకపోతే ఈ శ్వేతపత్రాలకు అర్థం ఉండదు. ప్రజా కోర్టులో వారిని ప్రజలు శిక్షించి ఉండవచ్చు కానీ… చట్ట పరంగా కూడా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు.