టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు .. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ లాగే.. చంద్రబాబు కూడా.. ముందుగానే అభ్యర్థులని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. జనవరిలోనే.. వంద స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తానని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సాధారణంగా చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేసే స్టైల్ భిన్నంగా ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ.. అదో సీరియల్ గా సాగుతూ ఉటుంది.ఈ విధానానికి స్వస్తి చెప్పాలని చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే నెల్లో సుమారు 100 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు జాబితాపై కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలలో ముందుగా ప్రకటించే అభ్యర్దుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కచ్చితంగా గెలుస్తారనుకున్న అభ్యర్ధుల జాబితాను చంద్రబాబు జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున 102 మంది గెలిచారు. వీరిలో 30 నుంచి 40 మందికి టిక్కెట్లు నిరాకరిస్తామని చెబుతున్నారు. వీరు కాకుండా.. వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్న మిగతా నియోజకవర్గాలు కలిపి ఓ వంద స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థుల్నిగుర్తించారు. వీరందిరి పేర్లు ముందుగానే ప్రకటిస్తే ఆయ ఆనియోజకర్గాల్లో ఉన్న చిన్నపాటి వివాదాలను కూడా సరిచేసుకుని ముందుకు వెళ్లేందుకు బాగుంటుందని పలువురు నేతలు ముఖ్యమంత్రికి చెప్పారు. ఎన్నికలు షెడ్యూల్ ఫిబ్రవరిలో వస్తుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో అంతకు ముందే ప్రకటించి ప్రచారానికి వెలితే బాగుంటుందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పొత్తులు గురించి పట్టించుకోకుండా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఎంపిక చేసుకుని రాజకీయంగా దూకుడుగా వెళితేనే మంచిదనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.
జాతీయ స్థాయిలో బిజెపీయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపిస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో సీట్ల సర్ధుబాటు ఉంటుందేమోనన్న అనుమానాలు పార్టీ క్యాడర్ లో ఉన్నాయి తెలంగాణలో ఎదురు దెబ్బ తిన్నందున జాతీయ స్థాయిలో కలసి పోటీ చేసినా… ఏపీలో మాత్రం టీడీపీ కేడర్ పొత్తు వద్దంటోంది. ఆ అభిప్రాయానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వనున్నారని అంటున్నారు.