వైసీపీ హయాంలో రాజధాని లేని రాష్ట్రంగా వెక్కిరింతకు గురైన ఏపీని ఆత్మగౌరవ పట్టాలు ఎక్కించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే రాజధాని అమరావతికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజధాని నిర్మాణంపై దృష్టిపెట్టి హామీలను విస్మరిస్తున్నారంటున్న విమర్శకుల నోటికి తాళం వేస్తూ… ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు రెడీ అయింది.
కూటమి అధికారంలోకి వస్తే మత్య్సకారులకు 20వేలు ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చబోతోంది. శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు..బుడగట్లపాలెంలో మత్య్సకార భరోసా పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. లబ్దిదారులకు సాయం అందించిన తర్వాత వారితో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడనున్నారు.
ప్రతి ఏడాది ఏప్రిల్ 15నుంచి జూన్ 14వరకు సముద్రంలో చేప వేట నిషేధం. ఈ రెండు నెలలు చేపల ఉత్పత్తి సమయం కావడంతో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. దీంతో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మత్య్సకారులకు ఆర్థిక సాయం అందించే పథకం టీడీపీ హయంలోనే ప్రారంభమైంది. అయితే , వైసీపీ హయాంలో ఈ పథకం ద్వారా 10వేలు ఇచ్చినా సరిపోవడం లేదని, వాటిని 20వేలుకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చుతుండటంతో మత్య్సకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అమరావతికి ఓ రూపు తీసుకువచ్చేలా చేస్తూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని అంటున్నారు.