2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పటికే వివాదాస్పదం చేశారు స్వామీజీలు. అది ఆంగ్లేయ సంప్రదాయం గనక మనకు సంబంధం లేదనీ, గుళ్లూ గోపురాల్లో అధికారికంగా ఎలాటి సంరంభాలు వద్దని వాదించారు. దీనిపై మాలాటి వాళ్లం విమర్శించడమే గాక హైకోర్టు కూడా తోసిపుచ్చింది. ఈ రోజు చాలా చోట్ల మామూలుగానే అలంకరణలూ ఆశీర్వాదాలు కనిపించాయి. చంద్రబాబు నాయుడు దంపతులు తిరుపతి పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారట. బాగానే వుంది గాని పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా ప్రసంగాలలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేప్పుడు మాత్రం చంద్రబాబు మాత్రమే గాక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఎందుకో విపరీతమైన సంజాయిషీ ఇచ్చుకున్నారు.ఉగాదికి మళ్లీ చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ తేదీలు ఇవి మనం తెచ్చినవి కాకున్నా వున్నాయి గనక అనుసరించాల్సిందేనని సమర్థించుకున్నారు. వెంకయ్య నాయుడు కూడా అదే తరహాలో రాజ్యసభకు సెలవు ఇచ్చేందుకు దారితీసిన పరిస్థితులు చెప్పారు. సంతోషంగా చెప్పాల్సిన శుభాకాంక్షలు ఇంతటి సంజాయిషీతో చెబితే ఏమైనా స్వారస్యం వుంటుందా అద్యక్షా?స్వాముల మాటలకు అంత విలువిచ్చి విన్యాసాలు చేయాలా అద్యక్షా?? ఇన్ని భాషలు వున్న ఇండియాలో తెలుగుతమిళ కన్నడ మళయాల హిందీ బెంగాలీ వగైరాలలో ఏ సంవత్సరాన్ని జాతీయంగా పాటించాలో చెప్పగలరా ఎవరైనా?