ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రధానిని కలుసుకోవడం కోసం వెళ్లారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారనీ, దానిపై మోడీ సానుకూలంగా స్పందించారనీ అంటున్నారు. ఇక, ఈ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రధానిని కలిసింది సమస్యలు చెప్పుకోవడానికీ, బ్రీఫింగ్ ఇవ్వడానికా అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ చెబుతున్న భాజపాయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుపై ఉన్న చిత్తశుద్ధిని చంద్రబాబు ప్రశ్నించారు.
‘నిన్నటి వరకూ అందరి దగ్గరకీ తిరిగి, వెళ్లి ప్రధానిని కలిస్తే ఏంటి..? ఇప్పుడు రాష్ట్ర సమస్యలా, లేదా బ్రీఫింగా? ఇవన్నీ చెప్పడం వేరు.. చేసే పనివేరు’ అన్నారు చంద్రబాబు. కేసీఆర్, భాజపాల యాక్షన్సే మాట్లాడుతున్నాయనీ, అందుకే వీరిపై ఎవ్వరికీ నమ్మకం లేకపోతోందన్నారు. ఓ పక్క ఫ్రంట్ అంటూ పర్యటనలు మొదలుపెట్టి, మరోపక్క ప్రధాని మోడీని కేసీఆర్ కలుస్తున్నారంటే ఏంటి అర్థమన్నారు. శ్వేతపత్రాల విడుదల సందర్భంగా అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచీ జాతీయ స్థాయిలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాటే లక్ష్యమని కేసీఆర్ చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాలను కూడా పక్కనపెట్టేసి… ఏకంగా జాతీయ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించి మద్దతు కూడగడతా అంటూ బయల్దేరారు. అయితే, నవీన్ పట్నాయక్ గానీ, మమతా బెనర్జీగానీ.. కోరిన వెంటనే కేసీఆర్ కి మద్దతు ఇస్తున్నట్టుగా స్పష్టంగా ప్రకటించలేదు. కాంగ్రెస్, భాజపాలు లేని కూటమి కోసం తనకు వారు మద్దతు ప్రకటిస్తున్నారని కేసీఆర్ కూడా చెప్పలేకపోయారు.
ఏదో ఒక జాతీయ పార్టీ ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే రాజకీయ శక్తి ఏర్పడదు అనేది చంద్రబాబు నాయుడు నమ్మకం. వాస్తవ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కేసీఆర్ నమ్ముతున్నట్టుగా ఆయన వెంట వచ్చేవారు ఎంతమంది అనేది ఇప్పట్లో స్పష్టత రాని అంశమే. లోక్ సభ ఎన్నికలు పూర్తయితే తప్ప.. ఇప్పుడు తటస్థంగా ఉంటున్నవారు ఎటువైపు మొగ్గుచూపుతారు అనేది తేలదు. పైగా, భాజపాయేతర, కాంగ్రెసేతర కూటమి అని కేసీఆర్ బయల్దేరినప్పుడు… ప్రధాని మోడీతో ఏ కారణంతో భేటీ అయినా, ఆయన చేస్తున్న రాజకీయ శక్తుల ఏకీకరణపై ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగానే కనిపిస్తుంది.