తెలుగు రాష్ట్రాలలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరైన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచే తన స్థాయి తగ్గించుకుంటూ వెళుతున్నాడు. రైతులందరి రుణాలను మాఫీ చేస్తూ తొలి ఫైల్ పైన సంతకం చేస్తానని చెప్పి… మాట తప్పడంతోనే చంద్రబాబు డ్రామాలు మొదలయ్యాయి. ఆ తర్వాత నుంచి అన్నీ అలాంటి స్ట్రాటజీలనే ఫాలో అవుతున్నాడు. అంతా కూడా సినిమాటిక్ వ్యవహారంలా ఉంటోంది. ప్రతి రోజూ మీడియాలో కనిపించాలన్న తపన బాగా ఎక్కువైంది. ప్రతిపక్షపార్టీలను లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాడు. తెలంగాణాలో అధికార పక్షాన్ని కూడా దెబ్బకొట్టాలని మొదట్లో భారీ ప్లాన్స్ వేశాడు కానీ ‘ఓటుకు కోట్లు’ కేసు దెబ్బకు కెసీఆర్కి భయపడి బిచాణా ఎత్తేశాడు. ఈ విషయంలో బేదాభిప్రాయాలు కూడా ఏమీ లేవు. అంతా బహిరంగ రహస్యమే.
భారతదేశ రాజకీయ నాయకుల్లో ‘విజన్’ అన్న పదాన్ని చంద్రబాబు మాట్లాడినన్ని సార్లు ఇంకెవరూ మాట్లాడి ఉండరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా విజన్ అన్న పదం ఆయన మాటల్లో తరచుగా వినిపిస్తూ ఉంది. కానీ చేతల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇన్స్టెంట్గా పేరు తెచ్చుకునే ప్రయత్నాలే చేస్తున్నాడు చంద్రబాబు. హుద్ హుద్ తర్వాత నుంచి ఆ విషయం మరీ స్పష్టంగా కనిపిస్తోంది. హుధ్ హుధ్ తుఫాను సమయంలో తన అవసరం లేకపోయినా చాలా రోజులపాటు విశాఖలో మకాం వేసిన చంద్రబాబు…ఆ మూలంగా తనకు చాలా మంచి పేరు వచ్చిందని భావిస్తున్నాడు. గోదావరి పుష్కరాల విషయంలో కూడా సేం స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. హుధ్ హుధ్ టైంలో వచ్చినలాంటి పేరు(?) తెచ్చుకుని ఉండేవాడే కానీ మొదటి రోజు తన మూలంగానే జరిగిన దుర్ఘటనతో చంద్రబాబు ఆశలన్నీ అడియాసలయ్యాయి. కృష్ణా పుష్కరాల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యానని చంద్రబాబు చెప్పుకున్నాడు. తన కీర్తి శాశ్వతం అనే రేంజ్లో తన గురించి తానే చెప్పేసుకున్నాడు. కానీ ఈ రెండు పుష్కరాలను కూడా అసలు పట్టించుకోని జనాలు కోట్ల మంది ఉన్నారన్నది మాత్రం వాస్తవం.
పుష్కరాల వరకూ అంటే చంద్రబాబు పబ్లిసిటీ జిమ్మిక్కులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే విమర్శలు కూడా మరీ ఎక్కువగా రాలేదు. కానీ అనంతపురం కరువు విషయంలో కూడా సేం సినిమాటిక్ స్టైల్ ఫాలో అవుతుంటే మాత్రం చిరాకొస్తోంది. ఈయనగారు ఓ ఐదారు రోజులు అనంతపురంలో టైం స్పెండ్ చేశారట. కరువును పారదోలారట. ఈయన ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుందట. జీవితంలో ఇంత ఆనందంగా ఎప్పుడూ లేడట. రెండేళ్ళలో నాలుగు విజయాలు సాధించడం వంద శాతం తృప్తిని ఇస్తోందట……..ఇంకా ఇలాంటి మాటలే ఎన్నో చెప్పేశాడు. విక్టరీ సింబల్ చూపిస్తూ….ఏదో అద్భుతాన్ని సాధించేశానన్న ఆనందాన్ని కళ్ళలో పలికిస్తూ చంద్రబాబుగారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే అద్భుతః . తెలుగు తెరపైన కనిపించిన గొప్ప నటులకు చంద్రబాబు ఏ మాత్రం తీసిపోడని అనిపించింది. అత్యంత అనుభవజ్ఙుడు, పాదయాత్ర చేసినప్పుడు తెలుగు ప్రజల కష్టాలను పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమ రైతుల కరువు సమస్యను ఇంత సిల్లీ డీల్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.
ఈ మధ్య కాలంలో చంద్రబాబు మాటలు కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. సీరియస్గా ఆయనను అభిమానించేవాళ్ళను కూడా బాధపెడుతున్నాయి. కృష్ణా పుష్కరాల సమయంలో కూడా ఇంతే. స్పష్టంగా తనను తాను పొగుడుకునే ధైర్యం చేయలేకపోతున్నాడు కానీ మరుసటి రోజు మీడియాలో మాత్రం తన గురించి అద్భుతంగా రాసే అవకాశం అనుకూల మీడియాకు ఉండేలా మాట్లాడుతున్నాడు. జనాలను భ్రమల్లో ఉంచుతున్నామన్న ఆనందంలో తామే భ్రమల్లో ఉండిపోతున్నారు. చంద్రబాబు ఏ పని చేసినా ప్రపంచమంతా ఆ పని గురించి చర్చిస్తోంది అనేలా రాసే వార్తలు అపహాస్యం పాలవుతున్నాయి. అనంతపురంలో చంద్రబాబు ఐధు రోజులు ఉండాగానే శాశ్వతంగా కరువు పరారైపోయిందని టిడిపి మంత్రులు చేస్తున్న ప్రకటనలయితే జుగుప్స కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులందరూ చంద్రబాబుకు జేజేలు పలుకుతున్నారని వాళ్ళు చేస్తున్న భజన అయితే పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతన్నలకు కోపం తెప్పించేలా ఉంది. చంద్రబాబు వైఫల్యాలన్నీ ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు ఆనందం కలిగిస్తున్నాయేమో తెలియదు కానీ ఇలాంటి జిమ్మిక్స్ కాకుండా తన అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే పనుల విషయంలో చంద్రబాబు శ్రధ్ధ పెడితే బాగుంటుందని మాత్రం సీమాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు.