తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే… కొన్ని ఇంగ్లిష్ టీవీ చానళ్లు చంద్రబాబు ఓ నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయబోతున్నారని..అందులో పదిహేను పార్టీలు ఉంటాయని ప్రచారం చేశారు. మే ఏడో తేదీన అమరావతిలో ఈ పార్టీల ర్యాలీ ఉంటుందని రిపబ్లిక్ టీవీ తేదీతో సహా చెప్పేసింది. ఆ వార్తలో ఎంత నిజముందో కానీ.. ఇప్పుడు కచ్చితంగా మే ఏడో తేదీన… బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలందరూ… అమరావతిలో సమావేశం కాబోతున్నారు.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమావేశాన్ని మే ఏడో తేదీన నిర్వహించాలని… ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు ఆర్ధిక మంత్రి యనమల ఆహ్వానం పంపారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పంజాబ్, బెంగాల్, సిక్కిం, మిజోరాం, పాండిచ్చేరి, ఢిల్లీ ఆర్ధిక మంత్రులకు వెళ్లింది. 15వ ఆర్ధిక సంఘం విధానాలను వ్యతిరేకిస్తూ కేరళలో తొలి సమావేశం జరిగింది. అమరావతిలో జరిగే రెండో సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనపై కసరత్తు చేస్తారు. 15వ ఆర్ధిక సంఘం విధానాల్లో మార్పులు చేయాలంటూ …12 రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల బృందంతో రాష్ట్రపతిని కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆహ్వానానికి మెజార్టీ రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నందుకు.. అక్కడి నుంచి అధికారులు సమావేశానికి వస్తారు.
పైకి ఆర్థిక మంత్రుల సమావేశంగా చెబుతున్నప్పటికీ.. రాజకీయ ఎజెండా లేకుండా ఉండదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఇంగ్లిష్ టీవీ చానళ్లు ప్రకటించినట్లు.. ఇది కచ్చితంగా ఫ్రంట్ కు ముందడుగేనని అంచనా వేస్తున్నారు. దేశ రాజకీయాల్లో అమరావతిలో జరిగే సదస్సు కీలకం కానుంది. కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేసే అవకాశం లభించనుంది. ఇప్పటికే చంద్రబాబు పలువురు జాతీయ పార్టీల నేతలతో.. సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు.. అనేక మంతి నేతల్ని కలిశారు. కానీ అప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు. ఈ సారి అమరావతిలో జరగనున్న సదస్సులో రాజకీయాలు కూడా కీలకం కానున్నాయి. ఈ సమావేశం వెనుక రాజకీయ వ్యూహం ఉంటే.. కచ్చితంగా అది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయమే.